Site icon NTV Telugu

Niranjan Reddy: కాసేపట్లో అంత్యక్రియలు, మాజీ మంత్రి పిలుపు.. పాడే మీది నుంచి లేచొచ్చిన వీరాభిమాని!

Niranjan Reddy Fan

Niranjan Reddy Fan

చనిపోయాడని అనుకుని అంతిమ సంస్కారాలు చేసేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేయగా.. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి తన అభిమానిని కడచూపు చూసేందుకు ఇంటికి వెళ్లారు. పూలమాల వేస్తుండగా బాడీలో కదలికలు వచ్చాయి. ఇది గమనించిన మాజీ మంత్రి.. గట్టిగా పిలవటంతో మరింతగా కదలాడు. ఆ వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అతడు బతికి బయటపడ్డాడు. తన అభిమాన నాయకుడి పిలుపుతో వీరాభిమాని ఏకంగా మృత్యువునే జయించాడు. మాజీ మంత్రి దేవుడిలా వచ్చి కాపాడారంటూ కుటుంబసభ్యులు కొనియాడారు. ఈ ఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం… వనపర్తికి చెందిన తైలం రమేష్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమ కారుడు. తెలంగాణ ఉద్యమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి పనిచేశాడు. ఈ క్రమంలో నిరంజన్ రెడ్డికి రమేష్ వీరాభిమానిగా మారాడు. నిరంజన్ రెడ్డిపై తన అభిమానాన్ని చాటుకుంటూ.. ఛాతీపై ఆయన ఫొటో, పేరును పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు. హైదరాబాద్‌లో నివసిస్తున్న రమేష్.. మూడు రోజుల కింద వనపర్తిలోని పీర్లగుట్టలో తన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత రమేష్ అస్వస్థతకు గురయ్యాడు. కొద్దిసేపటికే స్పృహ తప్పిపోయాడు. అతడిలో ఎటువంటి కదలికలు లేకపోవడంతో కుటుంబసభ్యులు చనిపోయాడని భావించారు.

Also Read: Kaleshwaram Project: సీబీఐ విచారణ జరపండి.. కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ!

విషాదంలో మునిగిపోయిన రమేష్ కుటుంబసభ్యులు ఆదివారం సాయంత్రం అంతిమ సంస్కారాలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అతడిని పడుకొబెట్టి పూలమాలలు వేశారు. మరోవైపు దహన సంస్కారాల కోసం డబ్బులు కూడా ఇచ్చేశారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.. రమేష్‌ను కడచూపు చూసేందుకు ఇంటికి వెళ్లారు. రమేష్‌ను చూసిన మాజీ మంత్రి కన్నీటిపర్యంతం అయ్యారు. అతడి కన్నీటి చుక్కలు రమేష్‌ గుండెపై ఉన్న పచ్చబొట్టుపై పడ్డాయి. నిరంజన్ రెడ్డి పూలమాల వేసేందుకు ముందుకు వంగటంతో బాడీలో కదలికలు గుర్తించారు. రమేష్.. రమేష్ అంటూ గట్టిగా పిలవటంతో మరింతగా కదలాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స తర్వాత రమేష్ కళ్లు తెరిచాడు. నిరంజన్ రెడ్డి సమయస్ఫూర్తికి రమేష్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం వనపర్తి జిల్లాలో ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version