రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. భారీ మెజార్టీ సాధించిన కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంగా గద్దెనెక్కారు. కాగా.. రాష్ట్రంలో వైసీపీ పార్టీ నాయకుల ఇళ్లపై కూటమి పార్టీల కార్యకర్తలు ఎగబడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల వైసీపీ నేతలు, వాళ్ల ఇళ్లపై దాడులు జరిగాయి. నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు మాజీ మంత్రుల, మాజీ ఎమ్మెల్యేల ఇళ్లవద్ద కపలా పెంచారు. అయినా దాడులు మాత్రం కొలిక్కి రావడం లేదు. తాజాగా మాజీ మంత్రి జోగిరమేష్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగిరమేష్ ఇంటిపై యువకులు రాళ్లురువ్వారు. AP39KD3267 కారులో వచ్చిన యువకులు జోగిరమేష్ ఇంటిముందే కారు ఆపి తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటి పైకి విసిరారు. రాళ్లు రువ్వుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్ కానిస్టేబుల్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. కానిస్టెబుల్ వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపారు. రాళ్ల దాడి జరిగిన సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేరు.
READ MORE: Public Toilet: ఇదేంటి భయ్యా.. పబ్లిక్ టాయిలెట్ బయట టైమర్స్.. అసలేమీ జరుగుతుంది..
కాగా.. వారం కిందట మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. జోగి రమేష్ ఇంటిపై తెలుగుదేశం పార్టీ నేతలు దాడికి దిగుతారని నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన ఇంటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆయన ఇంటి చుట్టూ ముళ్లకంచెలను ఏర్పాటు చేశారు. గతంలో జోగి రమేష్ చంద్రబాబు ఉండవల్లి నివాసం వద్దకు వెళ్లి దాడికి ప్రయత్నించారని, అందుకు ప్రతిగా ఆయన ఇంటిపై దాడికి టీడీపీ కార్యకర్తలు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా అన్ని మార్గాలలో పోలీసులు బందోబస్తును నిర్వహిస్తున్నారు.