NTV Telugu Site icon

Bangladesh: విద్యార్థులకు మాజీ ప్రధాని ఖలీదా జియా వీడియో సందేశం.. పోరాటంపై ప్రశంసలు

Khaledazia

Khaledazia

ధైర్యవంతులైన విద్యార్థులు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారంటూ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా వీడియో సందేశం విడుదల చేశారు. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌కు రాగానే.. జియాను అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ విడుదల చేశారు. గురువారం నిరసనకారులను ప్రశంసిస్తూ ఆసుపత్రి బెడ్‌పై నుంచి జియా వీడియో విడుదల చేశారు. తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

‘‘అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయడానికి మృత్యువుతో పోరాడిన మా ధైర్యవంతులైన పిల్లలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వందలాది మంది అమరవీరులకు నివాళులర్పిస్తాను’’ అని ఆమె పేర్కొన్నారు.

‘‘ఈ విజయం మనల్ని కొత్త ఆరంభానికి తీసుకొచ్చింది. దీర్ఘకాలిక ప్రజాస్వామ్య శిథిలాలు, కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన అవినీతి నుంచి బయటపడి కొత్త దేశాన్ని, సుసంపన్నమైన బంగ్లాదేశ్‌ను నిర్మించాలి. విద్యార్థులు, యువతే మన భవిష్యత్తు.. తీసుకువస్తాం. వాళ్లు ఏ కలల కోసం ప్రాణం పోసుకున్నారో ఆ కలలకు ప్రాణం పోయండి’’ అని ఆమె సోషల్ మీడియాలో సందేశంలో పేర్కొంది.

బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీకి సారథ్యం వహిస్తున్న ఖలీదా జియా 1991- 1996, 2001- 2006 నడుమ పదేళ్లు ప్రధానిగా పనిచేశారు. 2018లో విదేశీ విరాళాల దుర్వినియోగం కేసులో ఆమెకు 17 ఏళ్లు జైలు శిక్ష పడింది. అనంతరం ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా ప్రభుత్వం ప్రకటించింది. 78 ఏళ్ల జియా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె ఢాకాలోని ఎవర్‌కేర్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.