Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ ను ఉద్దేశించి కొన్ని వ్యంగ్యాస్త్రాలను సంధించారు. తన భార్య కూడా మీలా తిట్టలేదంటూ ట్విట్ చేశారు. కొంత కాలంగా సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి, కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకూ మధ్య వార్ నడుస్తోంది. అది రోజురోజుకు ముదురుతోంది. ఈ క్రమంలోనే కేజ్రివాల్ సర్కార్ ను విమర్శిస్తూ నిత్యం ఏదో అంశం మీద లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అరవింద్ కేజ్రీవాల్ కు లేఖలు రాస్తున్నారు. గవర్నర్ రాస్తున్న లేఖలు సీఎంకు చికాకు పుట్టిస్తున్నాయి. దీంతో కేజ్రివాల్ లెఫ్టినెంట్ గవర్నర్ తీరుపై వ్యంగాస్త్రాలు సంధించారు.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తనకు రాసిన లేఖలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ స్పందించారు. లెఫ్టినెంట్ గవర్నర్ శాంతించాలని కేజ్రివాల్ కోరారు. తన భార్య కూడా తనకు అన్ని లేఖలు రాయలేదని సక్సేనాను ఉద్దేశించి కేజ్రివాల్ వ్యాఖ్యానించారు. ఎల్‌జీ సాహిబ్ రోజూ తిట్టినంతగా నా భార్య కూడా తనను తిట్టదన్నారు. గత ఆరు నెలల్లో, ఎల్జీ తనకు రాసిన ప్రేమ లేఖల సంఖ్య చూస్తే తన జీవితకాలంలోనూ తన భార్య అన్ని రాయలేదని కేజ్రివాల్ తెలిపారు. ఎల్-జి సాహిబ్ కొంచెం కూల్ గా ఉండండి, అలాగే దయచేసి మీ సూపర్ బాస్‌కి కూడా కొంచెం శాంతంగా ఉండమని చెప్పండని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
Read Also: Vande Bharat: ప్రారంభించిన వారంలోపే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు యాక్సిడెంట్
అక్టోబరు 2న గాంధీ జయంతి రోజున రాజ్ ఘాట్ కు రాకపోవడం పట్ల ఎల్-జి సక్సేనా ఇటీవల కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. అంతకుముందు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం చెట్ల నరికివేతకు అనుమతులు మంజూరు చేయడంలో జాప్యంపై కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. ఇలా వరుసగా లేఖలు రాస్తుండటంపై కేజ్రివాల్ తన అసహనం వ్యక్తంచేశారు. ఇలా ప్రతీ అంశంపై లేఖలు రాయడం వల్ల ప్రయోజనం ఏముందని లెఫ్టినెంట్ గవర్నర్ ను ఆయన ప్రశ్నించారు.