NTV Telugu Site icon

Etela Rajender: తిరిగి టీఆర్‌ఎస్‌లోకి.. స్పందించిన ఈటల రాజేందర్‌

Etela Rajender

Etela Rajender

Etela Rajender: బీజేపీ నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తిరిగి గులాబీ గూటికి చేరతారనే కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. మళ్లీ గులాబీ కండువా కప్పుకుంటారని, ‘ఘర్ వాపసీ’ అంటూ ఈటల ఫొటోతో సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతుండగా.. ఈ ప్రచారాన్ని ఈటల రాజేందర్ ఖండించారు. తాను పార్టీ మారడం లేదని ఖరాకండిగా చెప్పేశారు. బీజేపీ నుంచి తాను తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని, తనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తున్నారన్న ప్రచారం అంతా పుకారే అని కొట్టి పారేశారు. ఇదంతా పచ్చి అబద్ధమని, ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ చేయిస్తున్న ప్రచారం అని విమర్శించారు.

Harish Rao: శ్రీ సత్యసాయి సంజీవని బాలల గుండె చికిత్స కేంద్రం.. ప్రారంభించిన మంత్రి హరీశ్‌ రావు

టీఆర్‌ఎస్‌ మొదట్నుంచి ఉన్న తనను కేసీఆర్‌ మోసం చేశారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌లో తాను 20 ఏళ్లు పని చేశానని.. 28 మంది ఎమ్మెల్యేల్లో పది మంది బయటకు వెళ్లిపోయినా తాను మాత్రం పార్టీని వీడలేదని ఈటల అన్నారు. టీఆర్ఎస్ తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా తాను పార్టీ మారలేదని తెలిపారు. పదవుల కోసం తాపత్రయపడే వ్యక్తినే అయితే రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడే మంత్రిని అయ్యేవాడినన్నారు. టీఆర్ఎస్‌ (TRS) నుంచి నేను వెళ్లిపోలేదు.. కేసీఆరే వెళ్లగొట్టారని ఆరోపించారు. ఎంత అవమానించినా బయటకు చెప్పుకోలేదన్నారు. భూకబ్జాదారుడు, అవినీతి పరుడని తనపై ఆరోపణలు చేశారని చెప్పారు. పార్టీ మారుతున్నానని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అంకితభావం ఎలాంటిదో అందరి కంటే కేసీఆర్‌కే ఎక్కువ తెలుసని ఈటల పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని అన్నారు. 2015 నుంచి ఆ పార్టీలో, ప్రభుత్వంలో తాను ఎన్నో రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఈటల తెలిపారు.