Site icon NTV Telugu

Union Budget 2026: కేంద్ర బడ్జెట్లో పదవీ విరమణ చేసిన వారికి బిగ్ రిలీఫ్? కనీస పెన్షన్ పెంపు

Epfo

Epfo

Union Budget 2026: భారత్ లో ద్రవ్యోల్బణం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, రిటైర్డ్ ఉద్యోగులందరికీ తమ పెన్షన్‌పై ఆందోళన కొనసాగుతుంది. ఉద్యోగ జీవితాన్ని పూర్తి చేసిన అనంతరం ఇతరులపై ఆధారపడకుండా గౌరవప్రదమైన జీవితం గడపడానికి సరిపడే పెన్షన్ రావాలని ప్రతి పెన్షనర్ ఆశిస్తాడు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ 2026కి ముందు పెన్షనర్లకు ఓ శుభవార్త వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనీస పెన్షన్ పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని సమాచారం. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)కి సంబంధించిన పెన్షనర్ల కోసం బడ్జెట్‌లో లేదా బడ్జెట్ తర్వాత గానీ కీలక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఇది కోట్లాది మంది పెన్షనర్లకు ఊరటనిచ్చే అంశంగా మారనుంది.

Read Also: Oscar Nominations 2026 : ఆస్కార్స్ నామినేషన్ 2026 ఫైనల్ లిస్ట్ ఇదే..

అయితే, ప్రస్తుతం EPFO పరిధిలో ఉన్న ఉద్యోగులకు నెలకు కనీస పెన్షన్ రూ.1,000 మాత్రమే వస్తుంది. గత 11 సంవత్సరాలుగా ఈ మొత్తంలో ఎలాంటి పెంపు కనిపించలేదు. ఈ 11 ఏళ్ల కాలంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగినా, పెన్షన్ మాత్రం యథాతథంగా ఉండటంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. నేటి ఆర్థిక పరిస్థితుల్లో రూ.1,000 పెన్షన్‌తో జీవించడం అసాధ్యమని వారు పేర్కొంటున్నారు. అయితే, జనవరి 6వ తేదీన కేంద్ర కార్మిక అండ్ ఉపాధి శాఖ మంత్రిని భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) ప్రతినిధుల బృందం కలిసి కనీస పెన్షన్ పెంపు అంశాన్ని ప్రస్తావించింది. ఇతర ఉద్యోగ సంఘాలు కూడా కనీస పెన్షన్‌ను నెలకు రూ.7,000 నుంచి రూ.10,000 వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇది పెన్షనర్ల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి అవసరమని తెలియజేస్తున్నారు.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

సుప్రీంకోర్టులో కేసు
కాగా, కనీస పెన్షన్ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో కూడా ఉంది. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఈ విషయంపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. రాబోయే బడ్జెట్ లో పెన్షనర్ల దీర్ఘకాలిక డిమాండ్‌కు కీలక మలుపుగా మారవచ్చని అంచనా వేస్తున్నారు.

EPFO కొత్త కార్యక్రమం
EPFO తన సేవలను మరింత సులభతరం చేయడానికి మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతోంది. ‘ఫెసిలిటేషన్ అసిస్టెంట్స్’ అనే వ్యవస్థను అమలు చేయాలని యోచిస్తోంది. వీరు పెన్షన్, PF క్లెయిమ్స్, ఖాతాల లింకింగ్, ఇతర ప్రక్రియల్లో సభ్యులకు సహాయం చేస్తారు. నిర్ణీత ఫీజుతో ఈ సేవలు అందించబడతాయి. దీని వల్ల ముఖ్యంగా వృద్ధ పెన్షనర్లు పదే పదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సౌకర్యంగా తమ పనులు పూర్తి చేసుకోవచ్చు అన్నమాట. మొత్తానికి, కేంద్ర బడ్జెట్ 2026 పెన్షనర్లకు ఆశాజనకంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కనీస పెన్షన్ పెంపుపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే, అది లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగుల జీవితాల్లో పెద్ద మార్పును తీసుకు వస్తుంది.

Exit mobile version