Fielder Clicks Finger Video: క్రికెట్ చరిత్రలోనే వినూత్న చీటింగ్.. వేలితో చిటికేసి బ్యాటర్‌ను అవుట్ చేశాడు.. వీడియో వైరల్..

Fake

Fake

ఇంగ్లీష్ క్లబ్ క్రికెట్‌లో ఒక విచిత్రమైన, వినూత్నమైన మోసం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా క్రికెట్ మైదానంలో బాల్ టాంపరింగ్, ఫేక్ ఫీల్డింగ్ వంటి వివాదాలు చూస్తుంటాం, కానీ ఈసారి ఒక ఫీల్డర్ ‘ఫేక్-ఎడ్జ్’ ద్వారా అంపైర్‌ను బురిడీ కొట్టించి బ్యాటర్‌ను అవుట్ చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో పాటు పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది.

ఈ ఘటన ‘నార్త్ యార్క్‌షైర్ అండ్ సౌత్ డర్హామ్ క్రికెట్ లీగ్’ డివిజన్-2 లో భాగమైన సాల్ట్‌బర్న్ క్రికెట్ క్లబ్, మిడిల్స్‌బ్రో సెకండ్ ఎలెవన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకుంది. మ్యాచ్ సమయంలో బ్యాటర్ బంతిని ఆడేందుకు ప్రయత్నించగా, బంతి బ్యాట్‌కు తగలకుండానే వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అయితే.. ఫస్ట్ స్లిప్‌లో నిలబడిన సాల్ట్‌బర్న్ ఫీల్డర్ సరిగ్గా బంతి బ్యాట్‌ను దాటే సమయంలో తన వేళ్లతో బిగ్గరగా చిటికె వేశాడు. ఆ శబ్దాన్ని బంతి బ్యాట్ అంచుకు తగిలిన శబ్దంగా భావించిన అంపైర్ బ్యాటర్‌ను అవుట్‌గా ప్రకటించాడు.

మిడిల్స్‌బ్రో సెకండ్ ఎలెవన్ కెప్టెన్ రోరీ కాటరిల్ ఈ ఘటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ మ్యాచ్‌లో సాల్ట్‌బర్న్ జట్టు 29 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ, మ్యాచ్‌ సమయంలో 15, 16 సంవత్సరాల వయస్సున్న యువ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఫేక్-ఎడ్జ్ మోసాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఒకే మ్యాచ్‌లో దాదాపు మూడుసార్లు ఇలాంటి ఘటనలు జరిగాయని, నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న తనకు మొదట్లో ఏం జరిగిందో అర్థం కాలేదని తెలిపారు. ఆ తర్వాత ఇతర మ్యాచ్‌ల వీడియోలు కూడా బయటకు రావడంతో వివాదం మరింత ముదిరింది.

ఈ ఆరోపణలపై నార్త్ యార్క్‌షైర్ అండ్ సౌత్ డర్హామ్ క్రికెట్ లీగ్ నిర్వాహకులు స్పందించారు. ఈ ఘటనపై అధికారికంగా ఫిర్యాదు అందిందని, దీనిపై సమగ్ర విచారణ ప్రారంభించామని ధృవీకరించారు. విచారణ పూర్తయి, పూర్తి స్థాయి నివేదిక వచ్చేంత వరకు ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని లీగ్ కమిటీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ మోసం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.