Womens T20 World Cup 2026: ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) మహిళల T20 వరల్డ్ కప్ 2026 కోసం ఇంగ్లాండ్ జట్టును ప్రకటించింది. అనుభవజ్ఞులూ, యువ ప్రతిభల సమ్మేళనంగా ఉన్న ఈ జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ నాట్ సైవర్-బ్రంట్ (Nat Sciver-Brunt) కెప్టెన్‌గా నియమితులయ్యారు. గ్రూప్-Bలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు తన తొలి మ్యాచ్‌ను శ్రీలంకతో జూన్ 12న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆడనుంది.
ముంబై ఇండియన్స్ తరఫున WPLలో ఆడుతున్న సైవర్-బ్రంట్ అంతర్జాతీయ క్రికెట్‌లో బ్యాట్, బాల్ రెండింటితోనూ రాణించగలదు. ఆమె నాయకత్వంలో ఇంగ్లాండ్ జట్టు 16 T20 మ్యాచ్‌ల్లో 11 విజయాలు సాధించింది. ఇప్పటివరకు 137 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆమె 2960 పరుగులు, 90 వికెట్లు సాధించింది. ఈసారి జట్టులో 18 ఏళ్ల యువ స్పిన్నర్ టిల్లీ కోర్టీన్-కోల్మన్ కు చోటు కల్పించారు. మహిళల హండ్రెడ్ టోర్నీలో 17 వికెట్లు తీసి మంచి ప్రదర్శన కనబరిచిన ఆమె, స్పిన్ విభాగంలో సోఫీ ఎక్లెస్టోన్ కు సహకరించనుంది.
బ్యాటింగ్ విభాగంలో డానీ వైట్-హాడ్జ్, హీథర్ నైట్, సోఫియా డంక్లీలు కీలక పాత్ర పోషించనున్నారు. వీటికితోడు వికెట్‌కీపర్ బ్యాటర్ యేమి జోన్స్ కూడా జట్టుకు బలం కానుంది. బౌలింగ్ విభాగంలో RCB తరఫున ఆడుతున్న లారెన్ బెల్ ప్రధాన పేసర్‌గా వ్యవహరించనున్నారు. ఆమెకు ఫ్రేయా కెంప్, లారెన్ ఫైలర్, ఇస్సీ వాంగ్ మద్దతు ఇవ్వనున్నారు. ఇక స్పిన్ విభాగంలో ఎక్లెస్టోన్, టిల్లీతో పాటు అలిస్ క్యాప్సీ, లిన్సే స్మిత్, చార్లీ డీన్ వంటి ఆటగాళ్లు కీలకంగా మారనున్నారు.
ఇంగ్లాండ్ మహిళల T20 వరల్డ్ కప్ 2026 జట్టు:
నాట్ స్కివర్-బ్రంట్ (కెప్టెన్), సోఫియా డంక్లీ, ఫ్రేయా కెంప్, లారెన్ బెల్, సోఫీ ఎక్లెస్టోన్, హీదర్ నైట్, అలిస్ క్యాప్సీ, లారెన్ ఫైలర్, లిన్సే స్మిత్, టిల్లీ కోర్టీన్-కోల్మన్, డానీ గిబ్సన్, ఇస్సీ వాంగ్, చార్లీ డీన్, ఎమీ జోన్స్, డ్యాని వైట్-హాడ్జ్.
ఇంగ్లాండ్ షెడ్యూల్:
జూన్ 12 – శ్రీలంకతో, బర్మింగ్‌హామ్
జూన్ 16 – ఐర్లాండ్‌తో, సౌతాంప్టన్
జూన్ 20 – స్కాట్లాండ్‌తో, హెడింగ్లీ
జూన్ 24 – వెస్టిండీస్‌తో, లార్డ్స్
జూన్ 27 – న్యూజిలాండ్‌తో, ఓవల్
