Site icon NTV Telugu

స్టోక్స్ మనసులో మాట.. ఆ రెండు జట్ల మధ్యే ఫైనల్ మ్యాచ్

టీ20 ప్రపంచకప్ రంజుగా సాగుతోంది. గ్రూప్-1లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు విజయాలతో దూసుకెళ్తున్నాయి. గ్రూప్ ఆఫ్ డెత్‌గా భావించిన గ్రూప్-1లో సెమీస్‌కు చేరే జట్లపై స్పష్టత వస్తున్నప్పటికీ గ్రూప్-2లోని జట్ల పరిస్థితి అయోమయంగా మారింది. దీనికి భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కారణంగా కనిపిస్తోంది. భారత్ ఈ మ్యాచ్‌లో పరాజయం కావడంతో సమీకరణాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటికే వరుసగా మూడు విజయాలతో పాకిస్థాన్ జట్టు సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. పటిష్టమైన భారత్, న్యూజిలాండ్ జట్లపై గెలిచిన పాకిస్థాన్ టీమ్.. శుక్రవారం ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ విజయకేతనం ఎగురవేసింది. 19వ ఓవర్‌లో అసిఫ్ అలీ నాలుగు సిక్సర్లు కొట్టి ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు.

Read Also: విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన బాబర్ ఆజమ్

ఈ నేపథ్యంలో అసిఫ్ అలీపై ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌ స్టోక్స్ ప్రశంసలు కురిపించాడు. ఈ పేరును గుర్తుపెట్టుకోండి అంటూ ట్వీట్ చేశాడు. మరోవైపు టీ20 ప్రపంచకప్ ఫైనల్ పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్యే జరగబోతుందని జోస్యం చెప్పాడు. ఇప్పటివరకైతే గ్రూప్-1లో ఇంగ్లండ్ టాప్‌లో ఉండగా.. గ్రూప్-2లో పాకిస్థాన్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే స్టోక్స్ ఇంగ్లండ్ ఆటగాడు కాబట్టి అలా చెప్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిందని గుర్తుచేస్తున్నారు. ఫైనల్ భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే అవకాశం ఉందని పలువురు నెటిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version