ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేడు ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది. తొలి టెస్టులో ఆధిపత్యాన్ని ప్రదర్శించినా.. చివరికి ఓటమి చవిచూసిన టీమిండియా ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు మొదటి టెస్టులో భారీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయం అందుకున్న ఇంగ్లండ్.. జోరు కొనసాగించాలని చూస్తోంది. ఈ టెస్ట్ కోసం ఇంగ్లండ్ ఇప్పటికే తుది జట్టును ప్రకటించింది. ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగాలా అనే సందిగ్ధంలో భారత్ ఉంది. ఈ మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడే అవకాశముంది.
సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను ఎదుర్కోవడం శుభ్‌మన్ గిల్ బృందానికి పెను సవాలే. లోయర్ ఆర్డర్, బౌలర్ల వైఫల్యం తొలి టెస్టులో భారత్‌ను దెబ్బతీసింది. మరి కలిసిరాని ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ 8 టెస్టులు ఆడగా.. ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక టెస్టును మాత్రం డ్రాగా ముగించింది. ఇక్కడ విజయమే లేదంటే ఇంగ్లండ్ ఆధిపత్యం ఎలా కొనసాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఎడ్జ్‌బాస్టన్‌లో పిచ్ ఆరంభంలో పేసర్లకు సహకరించైనా.. క్రమంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. చివరి రెండు రోజుల్లో స్పిన్నర్లకు సహకారం లభించవచ్చు. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎడ్జ్‌బాస్టన్‌లో మధ్యాహ్నం 3.30 నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. ‘జియోహాట్‌స్టార్’లో మ్యాచ్ ఫ్రీగా చూడొచ్చు.
తొలి టెస్టులో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ సెంచరీలు చేశారు. ఫామ్‌లో ఉన్న వీరు మరోసారి రాణిస్తే భారత్‌కు తిరుగుండదు. సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ రాణించాల్సిన అవసరముంది. లోయర్ ఆర్డర్‌లో జడేజా, శార్దూల్ నుంచి కనీస తోడ్పాటు లేకపోవడమే ఆందోళన కలిగిస్తోంది. బౌలింగ్‌లో బుమ్రా తప్ప అందరూ విఫలమయ్యారు. ప్రసిద్ధ్ , సిరాజ్, శార్దూల్, జడేజా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రెండో స్పిన్నర్‌గా కుల్దీప్, సుందర్‌లలో ఒకరు ఆడుతారు. శార్దూల్‌ను పక్కన పెట్టడం ఖాయం. బుమ్రా సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నాడని కెప్టెన్ చెప్పాడు. కానీ అతడు తుది జట్టులో ఉంటాడా లేదా అన్నది తెలియదు. ఒకవేళ బుమ్రా లేకపోతే అర్ష్‌దీప్ సింగ్ అరంగేట్రం చేయొచ్చు.
Also Read: Telangana Rains: తెలంగాణ రైతులకు శుభవార్త.. రెండు రోజుల పాటు వర్షాలు!
తుది జట్లు (అంచనా):
భారత్): జైస్వాల్, రాహుల్, సుదర్శన్, గిల్, పంత్, కరుణ్ నాయర్, జడేజా, సుందర్/కుల్దీప్, బుమ్రా/అర్ష్‌దీప్, సిరాజ్, ప్రసిద్ధ్.
ఇంగ్లండ్: క్రాలీ, డకెట్, ఒలీ పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్, స్మిత్, వోక్స్, కార్స్, జోష్ టంగ్, బషీర్.
