Site icon NTV Telugu

ENG vs IND: నేడే ఇంగ్లండ్, భారత్ తొలి టెస్టు.. ప్లేయింగ్ 11, పిచ్‌, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్!

Eng Vs Ind 1st Test

Eng Vs Ind 1st Test

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మల రిటైర్మెంట్‌ నేపథ్యంలో శుభ్‌మన్‌ గిల్‌ సారథ్యంలో టీమిండియాలి ఇది కొత్త శకం. ఇంగ్లండ్‌లో భారత్‌ టెస్టు సిరీస్‌ గెలిచి 18 ఏళ్లు అవుతుంది అంటే.. అక్కడ జట్టును నడిపించడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. దశాబ్దాలుగా ఇంగ్లీష్ గడ్డపై పర్యటిస్తున్నా.. అక్కడ మూడుసార్లు మాత్రమే భారత్‌ టెస్టు సిరీస్‌ గెలిచింది. ఈ నేపథ్యంలో గిల్‌కు ఈ సిరీస్ పెద్ద పరీక్షే అనడంలో సందేహం లేదు. యువ భారత జట్టు ఇంగ్లిష్‌ టీంను ఎలా ఎదుర్కొంటుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బ్యాటింగ్‌లో భారత్‌కు పెద్దగా అనుభవం లేదు. సాయి సుదర్శన్‌ ఇప్పటివరకు ఒక్క టెస్టు ఆడలేదు. యశస్వి జైస్వాల్‌కు ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం లేదు. అందులోనూ ఇటీవల పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. శుభ్‌మన్‌ గిల్‌కు ఇంగ్లండ్‌లో పేలవ రికార్డుంది. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌లు ఇంగ్లండ్‌లో కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడినా గొప్ప రికార్డు మాత్రం లేదు. ఈ నేపథ్యంలో మన బ్యాటర్లు ఎలా రాణిస్తారో చూడాలి. జైస్వాల్‌తో కలిసి రాహుల్‌ ఇన్నింగ్స్‌ ఆరంభిస్తే.. సుదర్శన్‌ మూడో స్థానంలో దిగొచ్చు. ఇక ఆరో స్థానంలో కరుణ్‌ నాయర్‌ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఏకైక స్పిన్నర్‌గా జడేజా తుది జట్టులో ఉంటాడు.పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ పోటీలో నితీశ్‌ రెడ్డి, శార్దూల్‌ల మధ్య పోటీ ఉన్నా.. మన తెలుగు ఆటగాడికే అవకాశం దక్కొచ్చు. బౌలింగ్‌లో భారత్‌కు జస్ప్రీత్ బుమ్రా కీలకం. బుమ్రాకు తోడుగా సిరాజ్‌ కొత్త బంతిని పంచుకోనున్నాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ మూడో బౌలర్‌గా ఆడే అవకాశాలు ఉన్నాయి.

బ్యాటింగ్‌లో బలంగా ఉన్న ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ ఆటతో బెంబేలెత్తించాలని చూస్తోంది. క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్‌తో బ్యాటింగ్ లైనప్‌ దుర్భేద్యంగా కనిపిస్తోంది. రూట్‌ పరుగుల వరద పారించాలనే పట్టుదలతో ఉన్నాడు. పేస్‌ బౌలింగ్‌లో ఇంగ్లీష్ జట్టు ఇబ్బంది పడుతోంది. అండర్సన్, బ్రాడ్‌ రిటైర్‌ అయ్యారు. మార్క్‌ వుడ్‌ గాయంతో దూరం కాగా.. జోఫ్రా ఆర్చర్‌ రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడు. వోక్స్, కార్సీ, జోష్‌ టంగ్, స్టోక్స్‌లు పేస్ బౌలింగ్ చేయనున్నారు. బషీర్‌ స్పిన్‌ భారాన్ని మోస్తాడు.

హెడింగ్లీలో పిచ్‌పై పచ్చిక ఉంది. ఆరంభంలో పేసర్లకు సహకరించినా.. మ్యాచ్‌ సాగుతున్నకొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంది. టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. హెడింగ్లీలో ఇప్పటివరకు ఏడు టెస్టులాడిన భారత్.. నాలుగు ఓడిపోయి, రెండు గెలిచింది. ఓ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. మధ్యాహ్నం 3.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. సోనీ స్పోర్ట్స్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

తుది జట్లు (అంచనా):
ఇంగ్లండ్‌: క్రాలీ, డకెట్, ఒలీ పోప్, రూట్, హారీ బ్రూక్, స్టోక్స్, జేమీ స్మిత్, వోక్స్, బ్రైడన్‌ కార్సీ, జోష్‌ టంగ్, బషీర్‌.
భారత్‌: జైస్వాల్, రాహుల్, సుదర్శన్, గిల్, పంత్, నాయర్, నితీశ్, జడేజా, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్‌.

Exit mobile version