Site icon NTV Telugu

Jharkhand: భారీగా నోట్ల కట్టలు బయటపడిన కేసులో మంత్రికి ఈడీ సమన్లు

Size

Size

గత సోమవారం జార్ఖండ్‌లో నోట్ల కట్టల డంప్ బయటపడడం తీవ్ర కలకలం రేపింది. ఓ మంత్రి సహాయకుడి ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. కొన్ని గంటల పాటు అధికారులు మిషన్లలో లెక్కిస్తే.. దాదాపు రూ.37 కోట్లు బయటపడ్డాయి. సార్వత్రిక ఎన్నికల వేళ ఇంత మొత్తంలో నగదు పట్టుబడడంతో దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. మూడో సారి అధికారంలోకి వచ్చాక.. నల్లధనాన్ని బయటకు తీస్తామని ప్రకటించారు.

ఈ నోట్ల కట్టలు బయటపడిన నేపథ్యంలో జార్ఖండ్ మంత్రి అలంగీర్ ఆలమ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన పర్సనల్ సెక్రటరీ సంజీవ్ లాల్ సహాయకుడి ఇంట్లో భారీగా నగదు పట్టుబడడంతో మంత్రి అలంగీర్‌కు ఈడీ నోటీసులు పంపింది. ఈనెల 14న తమ ముందు హాజరుకావాలని ఈడీ ఆయనను కోరింది.

రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మనీలాండరింగ్ చట్టం కింద మే 6వ తేదీన రాంచీలో ఈడీ దాడులు నిర్వహించింది. సంజీవ్ లాల్ డొమిస్టిక్ హెల్ప్ జహంగీర్ ఇంట్లో లెక్కల్లో చూపించని రూ.35 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. అనంతరం ఈ ఇద్దరినీ పీఎంఎల్ఏ కింద అరెస్టు చేయడంతో కోర్టు వారిని ఆరు రోజుల కస్టడీకి పంపింది. కాగా.. కాంగ్రెస్ కోటా నుంచి జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అలంగీర్ ఆలమ్ ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాలంటూ మంత్రి అలంగీర్‌కు ఈడీ నోటీసులు పంపడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Exit mobile version