NTV Telugu Site icon

Halari Donkey: గర్భం దాల్చిన గాడిదలకు సీమంతం.. గొప్ప కారణమే ఉందండోయ్ !

Donkey

Donkey

Halari Donkey: గర్భిణీలకు సీమంతాలు చేయడం, అప్పుడే పుట్టిన చిన్నారులకు బారసాల నిర్వహించడం సాధారణమే. కానీ గర్భం దాల్చిన గాడిదలకు సీమంతాలు నిర్వహించడం, గాడిద పిల్లలకు బారసాల నిర్వహించడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది నిజమేనండోయ్.. ఎక్కడో తెలుసా?. దీని వెనుక గొప్ప కారణమే ఉందండోయ్. అంతరించిపోయే జాబితాలో ఉన్న హలరీ జాతి గాడిదలను రక్షించేందుకు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ ప్రజలు కృషి చేస్తు్న్నారు. వీటి సంఖ్యను పెంచేందుకు అక్కడి ప్రజలు రకరకాలు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అలాగే పిల్లలకు ఎలా శుభకార్యాలు చేస్తారో.. అలాగే అప్పుడే పుట్టిన గాడిద పిల్లకు బారసాల, గర్భం దాల్చిన గాడిదకు సీమంతం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Read Also: Mechanical Elephant: ఆలయంలో ఆచారాలను నిర్వహించేందుకు రోబోటిక్ ఏనుగు.. తొలిసారిగా..

కొన్ని రోజుల క్రితం ఉప్లేటా తాలూకా కోల్కి గ్రామంలో ఓ ఆడ గాడిద మరో పిల్లకు జన్మనిచ్చింది. దీంతో ఈ బిడ్డ పుట్టడం వల్ల అక్కడి ప్రజలు ఆనందంలో సంబరాలు చేసుకున్నారు. ఆ ప్రాంతంలోని పశువుల కాపరులు, ప్రజలు ఆ బిడ్డకు బారసాల వేడుకతో పాటు గర్భం దాల్చిన 33 గాడిదలకు సీమంతం చేశారు. మనుషులకు చేసిన విధంగానే, వారంతా కలిసి ఆ పిల్లను శుభ్రం చేసి అందంగా అలంకరించారు. దీంతో పాటుగా గర్భం దాల్చిన గాడిదలకు నుదుటిన ఎర్రటి తిలకం దిద్ది, వీపుపై ఎర్రటి వస్త్రాలు కప్పారు. ఆ తర్వాత మహిళలు అనేక పూజలు చేసి.. వాటికి ప్రత్యేక ఆహారాన్ని అందించారు. ఈ వేడుకలను తిలకించేందుకు గ్రామస్థులు, జంతుప్రేమికులు తరలివచ్చారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడం కోసం కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలంతా ఆనందంతో మిఠాయి తినిపించుకున్నారు. ప్రస్తుతం హలరీ గాడిదల సంఖ్య సుమారు 417 మాత్రమే ఉన్నట్లు స్థానికులు వెల్లడించారు. స్థానికంగా ఉండే స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తున్నట్లు వెల్లడించారు.