Illegal Soil Mining: అర్ధరాత్రి అక్రమంగా మట్టి త్రవ్వకాలపై ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సీరియస్ అయ్యారు. అయితే, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో చొదిమెళ్ళ, దుగ్గిరాలలో జిల్లా యంత్రాంగం దాడులు నిర్వహించింది. పోలీసులతో పాటు వెళ్లి తనిఖీలు చేశారు ఏలూరు ఆర్డీవో ఎన్.ఎస్.కె,ఖజావలి, హోసింగ్ పీడీ కె.రవికుమార్, మున్సిపల్ కమిషనర్ ఎస్.వెంకట కృష్ణ, ఏలూరు తహశీల్దార్.. అక్రమంగా రాత్రిళ్ళు మట్టి తరలిస్తున్న 10 టిప్పర్లను సీజ్ చేసి.. కేసు నమోదు చేశారు. టిప్పర్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్రమ త్రవ్వకాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు.
Read Also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
రాత్రిళ్లు అక్రమంగా మట్టి త్రవ్వకాలపై యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్.. ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులు స్వయంగా మట్టిని తీసుకువెళ్లేందుకు మాత్రమే అనుమతులు ఇచ్చాం.. అది కూడా కేవలం పగటిపూట ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ముసుగులో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడితే చర్యలు తప్పవు అని వార్నింగ్ ఇచ్చారు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్.
