NTV Telugu Site icon

Eluru Crime: ఏలూరులో దారుణం.. యువకుడిని మందలించిన బాలిక తండ్రి మృతి!

Murder

Murder

తల్లి మృతి చెందడంతో ముగ్గురు చిన్నారులను అల్లారు ముద్దుగా చూసుకుంటున్న తండ్రి కథ విషాదంగా ముగిసింది. ఏలూరులో నిన్న అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యక్తి కేసును విచారణ చేపట్టిన పోలీసులు దారుణ వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారు. కూతుర్ని వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిని తండ్రి హెచ్చరించడంతో.. కక్ష పెంచుకుని తండ్రిని హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే..

ఏలూరు ఓవర్‌ బ్రిడ్జి కింద 39వ పిల్లర్‌ వద్ద నివాసం ఉంటున్న షేక్‌ వెంకట కనకరాజు భార్య నాగమణి ఎనిమిది సంవత్సరాల క్రితం మరణించింది. అతనికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కనకరాజు ఆటో నడిపేవాడు. ఏలూరు రూరల్‌ మండలం వెంకటాపురానికి చెందిన నాని అనే యువకుడు తరచుగా ఓవర్‌ బ్రిడ్జి కిందకు వచ్చి కనకరాజు పెద్ద కుమార్తె (12)ను వేధించేవాడు. తనకు ఇచ్చి పెళ్లి చేయాలని వేధించడంతో.. కనకరాజు, నానికి గొడవలు జరిగేవి. ఈ నేపధ్యంలో తమ పిల్లలను కాపాడుకోవడానికి ఉంగుటూరు మండలం నారాయణపురం మకాం మార్చాడు కనకరాజు. తాపీ పనులకు వెళ్తూ కుటంబంను పోషించుకుంటున్నాడు.

ఈనెల 13వ తేదీ ఉదయం 39వ పిల్లర్‌ వద్ద కనకరాజు నివాసం ఉన్న నాగిరెడ్డి గంగలక్ష్మి ఇంటి వద్దకు నాని వచ్చాడు. కనకరాజు వచ్చిన సంగతి నాని తెలుసుకుని.. అతని కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. కనకరాజు ససేమిరా అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు కనకరాజును నాని కత్తితో పొడిచి హతమార్చి పరారీ అయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం మూడు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.