Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!

Parvathipuram Manyam

Parvathipuram Manyam

Parvathipuram Manyam: పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు మండలం మామిడి పంచాయతీ పరిధిలో ఏనుగుల సంచారం స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. పూరిగానివలస గ్రామ సమీపంలోని పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల గుంపు చక్కర్లు కొడుతుండటంతో రైతులు, కూలీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒడిశా సరిహద్దుకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా ఏనుగుల కదలికలు పెరిగాయి.

ఏనుగుల సంచారం నేపథ్యంలో మామిడి పంచాయతీతో పాటు పరిసర గ్రామాల ప్రజలను అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో తోటల వద్దకు వెళ్లరాదని, ఏనుగులు కనిపించిన వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు. ప్రజలు గుంపులుగా ప్రయాణించాలని, ఏనుగులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. మామిడి పంచాయతీకి చెందిన రైతు రామారావు పామాయిల్ తోటలోకి ప్రవేశించిన ఏనుగులు డ్రిప్ ఇరిగేషన్ పైపులను ధ్వంసం చేశాయి. దీంతో రైతుకు భారీ నష్టం వాటిల్లింది.

×
×
Ad

ఏనుగుల భయంతో పామాయిల్ తోటల్లో పనులు చేసేందుకు కూలీలు ముందుకు రావడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో పండిన పామాయిల్ గెలలను కోయడం, వాటిని మార్కెట్‌కు తరలించడం కూడా కష్టసాధ్యంగా మారిందని గోడు వెళ్లబుచ్చుకుంటున్నారు. ప్రస్తుతం పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో ఏనుగుల సంచారం రైతులకు కొత్త సమస్యగా మారిందని వారు వాపోతున్నారు. ఏనుగుల గుంపు ఇంకా తోటల పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తుండటంతో అటవీ శాఖ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.