Site icon NTV Telugu

Electoral bonds: ఎస్‌బీఐ అభ్యర్థనపై మార్చి 11న విచారణ

Sew

Sew

ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించేందుకు సమయం పొడిగించాలని కోరుతూ ఎస్‌బీఐ (SBI) వేసిన పిటిషన్‌పై మార్చి 11న సుప్రీంకోర్టు (Supreme court) విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై సోమవారం విచారణ చేపట్టనుంది.

ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 6లోపు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలంటూ గత నెలలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పాటించడంలో విఫలమైన ఎస్‌బీఐపై ఏడీఆర్‌ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పైనా అదేరోజు వాదనలు విననుంది.

దేశంలో ఎన్నికల బాండ్ల (Election Bonds)ను రద్దు చేయడంతో పాటు 2019 ఏప్రిల్‌ 12 నుంచి కొనుగోలు చేసిన బాండ్ల వివరాలను ఈనెల 6వ తేదీ లోపు ఎన్నికల సంఘానికి సమర్పించాలని SBIని ఆదేశిస్తూ ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది.

అలాగే మార్చి 13 నాటికి ఎన్నికల బాండ్లు ఇచ్చిన వారి వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని ఈసీకి ఆదేశాలు జారీచేసింది. ఈనేపథ్యంలో బాండ్ల వివరాలను వెల్లడించేందుకు జూన్‌ 30 వరకు గడువు ఇవ్వాలంటూ ఈనెల 4న ఎస్‌బీఐ సుప్రీంకోర్టును అభ్యర్థించింది. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపిన అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌).. ఎన్నికల బాండ్ల వివరాలు సమర్పించడంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అధికారులు పాటించలేదని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం సుప్రీంకోర్టులో ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు దాతల వివరాలు, విరాళాల మొత్తాన్ని ప్రజలకు వెల్లడించకూడదనే ఉద్దేశంతోనే బ్యాంకు అధికారులు గడువు కోరుతున్నారని ఆరోపిస్తోంది.

Exit mobile version