తెలంగాణలో గత కొంత కాలంగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. ఎట్టకేలకు లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. మొత్తం 3 విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఎన్నికలకు సంబంధించిన తొలి దశ నోటిఫికేషన్ రిలీజ్ అయిన నేపథ్యంలో ఇప్పటికే పలు గ్రామాల్లో ఏకగ్రీవంగా అభ్యర్థులను ఎన్నుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు జరిగే ఏకగ్రీవాలపై ఎన్నికల కమిషన్ కీలక సూచనలు చేసింది.
పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై ఎన్నికల అధికారులకు ఎన్నికల కమిషన్ కీలక సూచనలు జారీ చేసింది. వేలం ద్వారా, బలవంతంగా సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు జరిగే ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాల వేలంపై ప్రత్యేక పర్యవేక్షణ విభాగం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వేలం, ప్రలోభపెట్టడం, బెదిరింపులు, బలవంతం, ఇతర సంబంధిత చర్యల నివేదికలను ఎన్నికల అధికారులు రియల్ టైమ్‌లో వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని తెలిపింది.
Also Read:WPL 2026 Auction: జాక్ పాట్ కొట్టిన తెలుగమ్మాయి శ్రీ చరణి.. అల్ రౌండర్ దీప్తి శర్మ కూడా..
వాట్సాప్, మౌఖిక ఫిర్యాదు, వార్తాపత్రిక క్లిప్పింగ్‌లు మొదలైన వాటి ద్వారా స్వీకరించడాన్ని ధృవీకరించడానికి జిల్లా ఎన్నికల అధికారి పర్యవేక్షణ కేంద్రాన్ని సమన్వయం చేస్తోంది. నామినేషన్ ఉపసంహరించుకునే అభ్యర్థుల నుండి (అనుబంధం-I) వారి ఉపసంహరణ స్వచ్ఛందంగా జరిగిందని నిర్ధారిస్తూ రిటర్నింగ్ అధికారి (RO) ఒక ప్రకటనను పొందాలి. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018లోని సెక్షన్ 211 ప్రకారం వేలం, ప్రలోభం, బలవంతం లేవని నిర్ధారిస్తూ సింగిల్/పోటీ లేని అభ్యర్థి నుండి RO డిక్లరేషన్ (అనుబంధం-II) పొందాలని సూచించింది.