గత కొన్ని నెలలుగా కూరగాయలు ధరలు మండిపోతున్న విషయం తెలిసిందే. కిలో టమాటా ధర రూ.35-40గా కొనసాగుతోంది. మిగతా కూరగాయలు రూ.30-50గా ఉన్నాయి. ఇది చాలదన్నట్టు మరోవైపు కోడిగుడ్డు రేటూ రోజురోజుకూ పెరిగిపోతోంది. హోల్ సేల్ మార్కెట్‌లో ఒక్కో కోడిగుడ్డు ధర రూ.5.90గా ఉండగా.. రిటైల్ మార్కెట్‌లో దాదాపుగా రూ.7గా పలుకుతోంది. ప్రస్తుతం డజను గుడ్ల ధర రూ.80గా ఉంది. దాంతో కోడిగుడ్డు కొనాలన్నా సామాన్య ప్రజలు ఆలోచించాల్సి వస్తోంది.
గత జనవరిలో ఒక్కో కోడిగుడ్డు ధర రూ.7లు పలికింది. అయితే ఏప్రిల్ నెలలో రూ.3 తగ్గి.. రూ.4 నుంచి రూ.4.50కి చేరింది. మే నెలలోకాస్త పెరిగి రూ.5 నుంచి రూ.5.50 పలికింది. జూన్, జులై నెలల్లో పెరుగుతూ.. ఆగస్టు వచ్చే సరికి రూ.6 నుంచి రూ.6.50కు చేరుకుంది. ఇటీవలి రోజుల్లో కాస్త తగ్గిన గుడ్డు ధర మళ్లీ పెరిగింది. ఇప్పుడు ఒక్కో కోడిగుడ్డు రూ.7లకు చేరి.. సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ డజన్ కోడిగుడ్లు రూ.80-84గా పలుకుతోంది.
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
రానున్న రోజుల్లో కోడిగుడ్డు ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. సాధరణంగా చలికాలంలో గుడ్డు వినియోగం పెరుగుతుంది. అదే సమయంలో క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా కేకుల తయారీకి పెద్దఎత్తున గుడ్లను వినియోగింస్తుంటారు.దాంతో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు కోళ్ల దాణా రేట్లు, రవాణా ఖర్చులు కూడా గుడ్ల ధరలపై ప్రభావం చూపిస్తాయి.