Edupayala Jatara: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలో మంజీరా నది ఒడ్డున కొలువై ఉన్న ఏడు పాయల వనదుర్గా భవాని జాతర నేడు ఘనంగా ప్రారంభమైంది. మహాశివరాత్రి నుంచి మూడు రోజుల పాటు వనదుర్గా భవాని జాతర కొనసాగనుంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి జాతరకు భక్తులు తరలివస్తున్నారు. సమ్మక్క- సారలమ్మ జాతర తర్వాత జరిగే రెండో అతిపెద్ద వనజాతర కావడంతో భారీ ఏర్పాట్లు చేశారు. మంజీరా నదిలో పుణ్యాస్నానాలు ఆచరించి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఏడూ ఉప నదులు కలిసి గోదావరి నదికి ఉపనది అయినా మంజీరా నదిలో కలుస్తాయి. అందుకే దీనికి ఏడుపాయల అనే పేరు వచ్చింది.
Read Also: Mahashivratri 2024: శివనామస్మరణతో మారుమోగుతున్న శివాలయాలు
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన వందల ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏడుపాయల వనదుర్గాభవాని ఆలయంలో నేటి నుంచి మూడు రోజులపాటు జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. మెదక్ జిల్లా కేంద్రం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఏడుపాయల ఆలయం ఉంటుంది. మేడారం జాతర తర్వాత రెండవ అతిపెద్ద జాతరగా చెప్పుకోదగినది. ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మంజీరా నదిలో పుణ్యస్థానాలు చేసి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో ప్రముఖ ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల జాతర ఏడాదికి ఒకసారి శివరాత్రి సందర్భంగా 03 రోజుల పాటు జరుగుతున్న నేపథ్యంలో ఈ జాతరకు రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా తరలిరానున్నారు. నేడు మహాశివరాత్రి ఉత్సవాలు,9న బండ్లు తిరుగుట,10న రథోత్సవం వైభవంగా జరుగుతాయి.