విద్యపై ముంబై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారతీయ సంస్కృతిలో ఒకప్పుడు విద్యకు ఎంతో పవిత్రత ఉండేదని, కానీ ప్రస్తుతం అటువంటి విద్య విద్యార్థులకు అందుబాటులో లేకుండా పోయిందని బాంబే హైకోర్టు (Bombay High Court) వ్యాఖ్యానించింది. నాణ్యమైన విద్య అందరికీ అందేలా చూడటం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని తెలిపింది.
పుణెలో విద్యాసంస్థల ఏర్పాటుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని కొట్టివేయలేమని న్యాయమూర్తులు ఏఎస్ చందూర్కర్, జితేంద్ర జైన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. హైకోర్టు ఫిబ్రవరి 21న ఇచ్చిన ఉత్తర్వుల్లో విద్యావిధాన విషయాల్లో కోర్టు జోక్యం చేసుకోదని, ఉత్తమమైన విద్యాసంస్థలను ఎంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారం ఉంటుందని వ్యాఖ్యానించింది.
పవిత్రమైన విద్యను రానురాను అభ్యసించలేనిదిగా మారిందని విచారం వ్యక్తం చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో అందరికీ నాణ్యమైన విద్య అందించేలా చూడడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా ధర్మాసనం అభివర్ణించింది.
