Site icon NTV Telugu

Talasani Srinivas: మంత్రి సోదరులను విచారిస్తున్న ఈడీ అధికారులు

Minister Talasani Srinivas Yadav

Minister Talasani Srinivas Yadav

Talasani Srinivas: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఐటీ, ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. పది రోజుల కింద టీఆర్ఎస్ నేతలకు చెందిన గ్రానైట్ పరిశ్రమపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. పరిశ్రమలో అనేక అవకతవకలను గుర్తించినట్లు ప్రకటించారు అధికారులు. మనీ లాండరింగ్ కు ఆధారాలు దొరికాయన్నారు. ఈ క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ సోదరులను ఈడీ ప్రశ్నించడం ఆసక్తి రేపుతోంది. ఆ పార్టీ నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేశాయని బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

Read Also: Tamil Nadu: మైనర్ బాలికపై లైంగిక దాడి.. మత్తు మందు ఇచ్చి బ్లాక్‌మెయిల్

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులైన తలసాని మహేశ్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్ లను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. మనీలాండరింగ్ వ్యవహారంలో ప్రశ్నిస్తున్నారు. క్యాసినో, హవాలా కేసుల్లో ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు. గత నాలుగేళ్ల ఆర్థికలావాదేవీలపై ఆరా తీస్తున్నారు. వారికి కొద్ది రోజుల కిందట ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. తలసాని సోదరులు మహేష్, ధర్మేందర్ యాదవ్ పలు రకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఈ వ్యాపారాల్లో హవాలా, మనీలాండరింగ్ వంటి వాటికి పాల్పడినట్లుగా ఈడీ అధికారులు అనుమనిస్తున్నారు. వారు క్యాసినో నిర్వహణలో పాలుపంచుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇటీవల క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో చీకోటి ప్రవీణ్‌తో లావాదేవీలు నిర్వహించిన వారి వివరాల్లో తలసాని సోదరుల లావాదేవీలు ఉన్నట్లుగా చెబుతున్నారు. దీనిపైనే విచారణకు వారిని పిలిచామన్నారు.

Read Also: Mahesh Babu: హమ్మయ్య మహేష్ నవ్వాడు.. థ్యాంక్స్ టు బాలయ్య

తలసాని సోదరులకు ఈడీ నోటీసులు ఇచ్చినట్లు వారు విచారణకు హాజరైన తర్వాతనే తెలిపింది. మొత్తంగా వారి వ్యాపారాలకు సంబంధించిన నాలుగేళ్ల ఆర్థిక లావాదేవీల వివరాలు తీసుకురావాలని ఈడీ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అయితే వీరి వ్యాపారాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు భాగస్వామ్యం ఉందో లేదో లేదు. మంత్రికి మాత్రం ఈడీ నోటీసులు జారీ కాకపోవడంతో.. ఆయన సోదరుల వ్యవహారంలోనే ఈడీ ప్రశ్నిస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ అంశంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Exit mobile version