HCA President Jaganmohan Rao Scam: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) స్కామ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. హెచ్‌సీఏ స్కామ్‌పై పూర్తి వివరాలు కావాలని తెలంగాణ నేర పరిశోధన విభాగం (సీఐడీ)ను ఈడీ కోరింది. హెచ్‌సీఏలో పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేసింది. హవాలా, మనీ లాండరింగ్ రూపంలో లావాదేవీలు జరిగినట్టుగా ఈడీ అనుమానిస్తోంది. హెచ్‌సీఏ కమిటీ సభ్యులు పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. బీసీసీఐ, ఐపీఎల్ ప్రాంచైజీ నుంచి వస్తున్న డబ్బులను దుర్వినియోగం చేసినట్లుగా ఈడీ అనుమానాలు వ్యక్తం చేసింది.
Also Read: TV Rama Rao: నేను ఏ తప్పు చేయలేదు.. టీవీ రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు!
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలో అక్రమాలు చేశారని, పదవి చేపట్టాక భారీగా నిధులు మళ్లించారని ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకాన్ని శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత ఫోర్జరీ చేసి, ఆ పత్రాలను జగన్మోహన్‌కు అందించారని.. ఆ పత్రాలతో హెచ్‌సీఏ అధ్యక్షుడైనట్లు సీఐడీ ఆరోపిస్తోంది. ఐపీఎల్ 2025 టికెట్ల కేటాయింపులో భారీగా ఆర్థిక అక్రమాలు జరిగాయని గుర్తించింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్‌ను సీఐడీ గురువారం అరెస్టు చేసింది. మల్కాజ్‌గిరి న్యాయస్థానం అతడికి 12 రోజుల రిమాండ్ విధించింది. జగన్మోహన్‌తో పాటు హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్, ఆయన సతీమణి కవితను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.
