Heavy Rains in East Godavari: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. గ్రామాలు, పంట పొలాలు, రహదారులు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తుండగా.. ఒక మహిళ వరద ప్రవాహంలో గల్లంతైంది. మరోవైపు వందల ఎకరాల్లో వరి పంట ముంపునకు గురై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో కూడా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
చారిత్రాత్మకమైన రాజమండ్రి నగరానికి ఏమైంది. మరో 8 నెలల్లో గోదావరి పుష్కరాలు రానున్న నేపథ్యంలో చినుకు పడితే చాలు రాజమండ్రి చిత్తు అవుతుంది. రాజమండ్రిలో ఎక్కడ చూసినా నీరు నిలిచిపోయి అన్ని ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. రైల్వే స్టేషన్ రోడ్డు, హైటెక్ బస్టాండ్, తుమ్మలోవ, వి.ఎల్. పురం, కంబాల చెరువు, తదితర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. ప్రణాళిక లేకుండా అభివృద్ధి పేరిట జరుగుతున్న పనులతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రణాళిక లేకుండా చేపడుతున్న పనులు కొత్త ఇబ్బందులను తెచ్చి పెడుతున్నాయి. దీనితో శివారు ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయి. వేసవిలో చేపట్టవలసిన పనులను వర్షాకాలంలో చేపట్టడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం అన్ని రహదారుల్లోనూ కాలువలు తగలడంతో ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోతుంది. వర్షాలకు రోడ్లు అన్నీ బురదమయం అవుతున్నాయి. ప్రజలు గోతుల్లో పడి ప్రమాదం బారిన పడుతున్నారు. కనీసం రోడ్డు మధ్యలో తవ్వినప్పుడు ఎటువంటి హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయడం లేదు.
పోలవరం జిల్లా వై.రామవరం మండలం బంగారుబందల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. దంపతులు కొండవాగును దాటే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆకస్మికంగా వరద ప్రవాహం పెరగడంతో ఇద్దరూ కొట్టుకుపోయారు. భర్త చెట్టు కొమ్మలను పట్టుకుని సురక్షితంగా బయటపడగా, భార్య బలిజ సుబ్బమ్మ వరద నీటిలో గల్లంతైంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ మహిళ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. కోరుకొండ మండలం గాదరాడ–కణుపూరు మధ్య రోడ్డుపై వరద నీటి ఉద్ధృతికి ఒక కారు కొట్టుకుపోయింది. అయితే స్థానికులు అప్రమత్తంగా స్పందించడంతో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో భారీ వర్షాలకు సుమారు 250 ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైంది. బ్రిడ్జి సమీపంలోని పొలాలు పూర్తిగా నీటమునగడంతో పొట్ట దశలో ఉన్న వరి పంట దెబ్బతింటుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఎకరాకు ఇప్పటికే రూ.40 వేల వరకు ఖర్చు చేశామని, పంట నష్టపోతే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత తుఫాన్ల సమయంలో జరిగిన పంట నష్టాలకు సంబంధించిన పరిహారం ఇప్పటికీ అందలేదని కౌలు రైతులు మండిపడ్డారు. ముంపు ప్రాంతాలను కొవ్వూరు తాసిల్దార్ దుర్గాప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. కాలువలను జేసీబీలతో శుభ్రం చేసి నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని అధికారులు పేర్కొన్నారు. తమను తక్షణమే ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

