Elephant: కర్ణాటకలో పర్యాటకురాలు మృతికి కారణమైన ఏనుగు మృతి.. ఏం జరిగిందంటే..

Elephantss

Elephantss

కర్ణాటకలోని కొడగు జిల్లా దుబారే ఏనుగుల క్యాంప్‌లో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో చెన్నైకి చెందిన జ్యునేష్ (33) అనే మహిళా పర్యాటకురాలితో పాటు, ‘మార్తాండ’ అనే ఏనుగు కూడా మృతి చెందింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కావేరీ నదిలో ఏనుగులకు స్నానం చేయిస్తున్న సమయంలో, ‘మార్తాండ’ (35), ‘కంజన్’ (26) అనే రెండు మగ ఏనుగుల మధ్య అకస్మాత్తుగా తీవ్రమైన ఘర్షణ జరిగింది. మావటిలు వాటిని నియంత్రించడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ పోరాటంలో ఒక ఏనుగు పట్టుతప్పి పక్కనే ఉన్న పర్యాటకురాలు జ్యునేష్‌పై పడింది. అనంతరం లేవడానికి ప్రయత్నించే క్రమంలో మార్తాండ ఆమెను తొక్కడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన 4,500 కేజీల బరువున్న మార్తాండ కూడా మరుసటి రోజు మరణించింది. ఈ ఘటనపై కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రే తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు.

ప్రభుత్వం కఠిన నిబంధనలు..
ఈ ఊహించని విషాదం తర్వాత పర్యాటకుల రక్షణే ధ్యేయంగా కర్ణాటక ప్రభుత్వం ఏనుగుల క్యాంప్‌లలో తక్షణమే కఠినమైన భద్రతా నిబంధనలను అమలు చేసింది. మంత్రి ఆదేశాల ప్రకారం పర్యాటకులు ఏనుగుల స్నాన ప్రక్రియను కనీసం 100 అడుగుల దూరం నుంచి మాత్రమే వీక్షించాలి. అలాగే భద్రతను మరింత మెరుగుపరచడానికి ఒక ప్రత్యేక ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (SOP) రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

కొత్త నిబంధనల ప్రకారం పర్యాటకులు ఏనుగుల దగ్గరకు వెళ్లడం, వాటితో అత్యంత సమీపంగా నిలబడి సెల్ఫీలు లేదా ఫోటోలు దిగడం, ఏనుగుల తొండాలను తాకడం, వాటికి స్వయంగా స్నానం చేయించడం, అరటిపండ్లు, బెల్లం, చెరకు వంటి ఆహార పదార్థాలను తినిపించడం వంటివి నిషేధించారు. పర్యాటకుల ప్రాణాల రక్షణ కోసం ఈ ఆంక్షలు తక్షణమే అమలులోకి వచ్చాయి.