Site icon NTV Telugu

Peeing Incident in Bus: ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన

Peeing Incident In Bus

Peeing Incident In Bus

Peeing Incident in Bus: కర్ణాటకలో అసభ్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఎయిర్ఇండియా విమానంలో ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఘటనను మరువక ముందే అదే తరహా ఘటన చోటుచేసుకుంది. బస్సులో నిద్రిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై ఓ యువకుడు మద్యం మత్తులో మూత్రం పోసిన విషయం ప్రస్తుతం కలకలం రేపుతోంది. బస్సు విజయపుర నుంచి మంగళూరుకు వెళ్తోంది. బస్సు హుబ్బళ్లి సమీపంలోని కిరేసూరులో ఒక దాబా వద్ద మంగళవారం అర్ధరాత్రి ఆగింది. బస్సులోని కొందరు ప్రయాణికులు దిగి టీ తాగుతుండగా.. కొందరు వాష్‌రూమ్స్‌కు వెళ్లారు. ఆ సమయంలో రామప్ప అనే వ్యక్తి ముందుసీట్లో కూర్చొని నిద్రపోతున్న మహిళ వద్దకు వచ్చాడు. ఆమెపై మూత్ర విసర్జన చేయగా.. నిద్రమత్తులో ఉన్న మహిళ ఈ హఠాత్మరిణామంతో ఉలిక్కిపడింది. వెంటనే భయంతో కేకలు వేయగా.. మిగిలిన ప్రయాణికులు అక్కడికి వచ్చి అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి బస్సులో నుంచి కిందకు తోసేశారు. మహిళ స్నానం చేసిన అనంతరం బస్సు అక్కడి నుంచి కదిలింది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మహిళ నిరాకరించడంతో ఆ యువకుడిపై పోలీసులకు చెప్పలేదని కండక్టర్ వెల్లడించారు.

Read Also: Bus Crashes Tree: చెట్టును ఢీకొట్టిన పెళ్లి బస్సు.. ముగ్గురు మృతి, 50 మందికి గాయాలు

ఆ వ్యక్తి మూత్రం పోసిన వెంటనే ప్రయాణికురాలు.. బస్సు కండక్టర్‌కు సమాచారం ఇచ్చారు. డ్రైవర్​, కండక్టర్ కలిసి ఆ వ్యక్తిని ప్రశ్నించారు. అతడి వివరాలు సేకరించేందుకు ప్రయత్నించారు. కానీ, మత్తులో ఉన్న ఆ వ్యక్తి.. బస్సులోనే క్షమాపణ చెప్పినట్లు కేఎస్ఆర్​టీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. తన వ్యక్తిగత వివరాలేవీ బయటపెట్టలేదని తెలిపింది. మరోవైపు, ప్రయాణికురాలు సైతం అతడిపై ఫిర్యాదు చేసేందుకు నిరాకరించారని కేఎస్ఆర్​టీసీ వివరించింది. దీంతో బస్సు షెడ్యూల్ ప్రకారం గమ్యాన్ని చేరుకుందని స్పష్టం చేసింది. అయితే, దీనిపై ఆర్​టీసీ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆర్​టీసీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

గతేడాది ఎయిరిండియా విమానంలో మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు ఇలాగే ప్రయాణికురాలిపై మూత్రం పోశాడు. మద్యం మత్తులో అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. నవంబర్ 26న జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌కు బాధితురాలు లేఖ రాసిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తనపై నిందితుడు మూత్రం పోసిన సమయంలో ఎయిర్ఇండియా సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రవర్తించారని బాధితురాలు ఆరోపించారు. దీంతో ఎయిర్​ఇండియాపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తమ ఉద్యోగుల తీరుపై చంద్రశేఖరన్ సైతం విచారం వ్యక్తం చేశారు. తగిన రీతిలో స్పందించాల్సి ఉండేదని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో నిందితుడైన శంకర్‌ మిశ్రా చాలా రోజుల తర్వాత పోలీసులకు చిక్కాడు. అనంతరం అతనికి బెయిల్‌ లభించింది.

Exit mobile version