Drugs Seized: బెజవాడలో మరోసారి ఎండీఎంఏ డ్రగ్స్ కలకలం సృష్టించాయి.బెంగుళూరు నుంచి బెజవాడ వచ్చిన కిలో ఎండీఎంఏ డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఏపీఎస్‌ఆర్‌టీసీ అనంతపురం డిపో బస్ ద్వారా డ్రగ్స్ బస్టాండ్ చేరుకున్నట్లు గుర్తించారు.
Read Also: Atrocious News: దారుణం.. అర్ధరాత్రి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తగలబెట్టేశారు..
ఆర్టీసీ డ్రైవర్ వైవీఎస్ రావుకి స్కూల్ బ్యాగ్ ఇచ్చి బెజవాడలో అందజేయాలని ఓ ఆగంతకుడు ఇచ్చినట్లు విచారణలో తెలిసింది. బస్సు విజయవాడ చేరుకున్న తర్వాత అర్ధరాత్రి డ్రైవర్ వైవీఎస్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాగ్‌లో ఉన్న బట్టల్లో ఓ ప్యాంటు నడుము చుట్టూ ఉన్న ఓ అంగుళం మందం పట్టీలో నిందితులు డ్రగ్స్‌ను పెట్టి కుట్టేశారు. ప్యాంట్‌లో కుట్టిన భాగాన్ని చించి డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ వైవీఎస్ రావును పోలీసులు విచారించారు.
అసలు ఏం జరిగిందంటే.. బెంగళూరులోని కెంపెగౌడ బస్‌స్టేషన్‌లో శుక్రవారం ఉదయం 6 గంటలకు బెజవాడ వెళ్లే సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్ వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. బ్యాగ్‌లో బట్టలు ఉన్నాయని, విజయవాడలో తన స్నేహితుడు వచ్చి తీసుకుంటాడని, అతని ఫోన్‌నంబరు డ్రైవర్‌కు ఇచ్చాడు. విజయవాడ వచ్చాక, రాత్రి 10.30కు బస్సును గ్యారేజీలో పెట్టి బయటకు వస్తుండగా ఓ యువకుడు వచ్చి బ్యాగ్‌ను తీసుకున్నాడు. అదే సమయంలో టాస్క్‌ఫోర్స్, పటమట పోలీసులు డ్రైవర్‌ను, యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ బ్యాగ్ తనిఖీ చేయగా.. ఓ ప్యాంటులో ఎండీఎంఏ డ్రగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్ గతంలో ఎప్పుడైనా ఇలా తీసుకొచ్చేవారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. పార్సిల్‌ను తీసుకునేందుకు వచ్చిన యువకుడు ఎవరెవరికి సరఫరా చేస్తున్నాడు, ఎవరెవరికి చేరుతోందన్న అంశాలను రాబడుతున్నట్లు తెలుస్తోంది.
గత నెలలో కూడా ఇలాంటి ఓ ఘటన జరిగింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సతీష్.. పాయసం మిక్స్ డబ్బాలో కాకినాడకు 46 గ్రాముల ఎండీఎంఏను తరలిస్తూ విజయవాడ బస్టాండ్‌లో దొరికిపోయాడు. ఇతను బెంగళూరులో అబ్దుల్ మిషాల్ అహ్మద్ అలియాస్ మిషాల్ నుంచి తీసుకున్నాడు.