Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!

  • మక్కా సమీపంలో డ్రోన్‌ను అడ్డుకున్న సౌదీ వైమానిక రక్షణ బలగాలు
  • నిషేధిత గగనతలంలోకి ప్రవేశించకముందే డ్రోన్ కూల్చివేత
  • సెప్టెంబర్ 15 సాయంత్రం దక్షిణ మక్కాలో ఘటన
  • డ్రోన్‌ను హూతీలు ప్రయోగించినట్లు సౌదీ అరేబియా ఆరోపణ..
Drone Attack On Mecca

Drone Attack On Mecca

Drone Attack on Mecca: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు సౌదీ అరేబియాలోని ముస్లింల పవిత్ర నగరం ‘మక్కా’ సమీపానికీ చేరాయి. మక్కా నగరానికి సమీపంలోని నిషేధిత గగనతలంలోకి ఓ డ్రోన్ ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. సౌదీ అరేబియా రాయల్ ఎయిర్ డిఫెన్స్ బలగాలు దానిని అడ్డుకుని కూల్చివేసినట్లు సౌదీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో మక్కా, జెడ్డా, తైఫ్ నగరాల్లో భద్రతా అప్రమత్తతను పెంచారు.

సౌదీ నేతృత్వంలోని కూటమి ప్రతినిధి తుర్కి అల్-మాలికి వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం మక్కా సమీపంలోని నిషేధిత గగనతలంలోకి డ్రోన్ ప్రవేశించేందుకు ప్రయత్నించింది. అయితే సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ దానిని గుర్తించి, నగరానికి చేరకముందే అడ్డుకుని నిర్వీర్యం చేసింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.

ఈ డ్రోన్‌ను యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు ప్రయోగించినట్లు సౌదీ అరేబియా ఆరోపించింది. మక్కా, ఇతర పవిత్ర స్థలాల భద్రత తమకు ‘రెడ్ లైన్’ అని సౌదీ అధికారులు హెచ్చరించారు. అయితే ఈ ఆరోపణలను హూతీలు ఖండించారు. మక్కా నగరంతో పాటు ఇతర ఇస్లామిక్ పవిత్ర స్థలాలకు తమ నుంచి ఎలాంటి ముప్పు లేదని హూతీ వర్గాలు స్పష్టం చేశాయి.

మక్కా, దాని పరిసర ప్రాంతాల్లో ఇలాంటి భద్రతా అలర్ట్‌ జారీ చేయడం 2017 తర్వాత ఇదే తొలిసారిగా అధికారులు పేర్కొన్నారు. హూతీలు గతంలో మక్కాను లక్ష్యంగా చేసుకునేందుకు ప్రయత్నించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజా పరిణామంతో మక్కాతో పాటు జెడ్డా, తైఫ్ నగరాల్లోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. మక్కా నగరంలో ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన కాబా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ముస్లింలు రోజువారీ ప్రార్థనల సమయంలో కాబా వైపు తిరిగి నమాజ్ చేస్తారు. ప్రతి ఏడాది హజ్, ఉమ్రా కోసం భారీ సంఖ్యలో ముస్లింలు మక్కాను సందర్శిస్తారు. దీంతో నగర భద్రతకు సౌదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.

యెమెన్‌లో హూతీ తిరుగుబాటుదారులతో సౌదీ అరేబియాకు చాలాకాలంగా ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో క్షిపణులు, డ్రోన్ల ప్రయోగాలతో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. సౌదీ నగరాలు, కీలక ప్రాంతాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో మక్కా, జెడ్డా, తైఫ్ ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పవిత్ర నగరం మక్కాను లక్ష్యంగా చేసుకున్నట్లు వచ్చిన వార్తలను ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) తీవ్రంగా ఖండించింది. పవిత్ర స్థలాలపై ఎలాంటి ముప్పునైనా అంగీకరించబోమని పేర్కొంది. మరోవైపు హూతీలు మాత్రం మక్కా లేదా ఇతర ఇస్లామిక్ పవిత్ర స్థలాలను తాము లక్ష్యంగా చేసుకోలేదని పునరుద్ఘాటించారు.