NTV Telugu Site icon

Donald Trump: ట్రంప్ సరికొత్త ఉపాయం.. విరాళాల కోసం భలే ప్లాన్ చేశారే!

Love Latter

Love Latter

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి అధికారం దక్కించుకునేందుకు కలలు కంటున్నారు. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఊబలాటపడుతున్నారు. దీంతో ఇప్పటికే ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రత్యర్థులపై విమర్శలు సంధిస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌పై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. తానే అధ్యక్షుడిగా ఉండుంటే ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం జరిగేది కాదని.. అలాగే జోర్డన్‌లో అమెరికా సైనికులు చనిపోయే వారు కాదంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.

తాజాగా ఎన్నికల కోసం ఆయన సరికొత్త ఉపాయం ఆలోచించారు. పెద్ద ఎత్తున విరాళాలు సేకరించేందుకు ప్లాన్ వేశారు. దీని కోసం తన భార్య మెలానియాకు రాసిన ప్రేమలేఖను అడ్డంపెట్టుకుని మద్దతుదారులను విరాళాలు అభ్యర్థించారు.

ప్రేమికుల దినోత్సవం (Valentines Day) సందర్భంగా మెలానియాకు రాసిన లేఖను ట్రంప్‌ తన ఫండ్‌ రైసింగ్‌ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేశారు.

లేఖలో ఏముందంటే..
‘‘డియర్‌ మెలానియా. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా. నాపై నేరాభియోగాలు వచ్చినా.. నన్ను అరెస్టు చేసినా.. ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పన్నినా.. నువ్వు నన్ను వదిలిపెట్టలేదు. కష్ట సమయంలో నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచావు. నీ మార్గదర్శకత్వం లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. నువ్వే నా ప్రపంచం- ప్రేమతో నీ భర్త డొనాల్డ్‌ ట్రంప్‌’’ అంటూ అందులో రాసుకొచ్చారు. దీన్ని వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసిన ట్రంప్‌.. ‘‘ఇది నా భార్యకు రాసిన వాలెంటైన్‌ డే లేఖ. మీరు కూడా నాపై మీ ప్రేమను కురిపించండి’’ అంటూ మద్దతుదారులను విరాళాలు కోరారు.

ట్రంప్ ఉపయోగించిన ప్రేమలేఖ అస్త్రం ఎంత వరకు విరాళాలు రాబడుతుందో వేచి చూడాలి. నిజంగానే మద్దతుదారులు ట్రంప్ విజ్ఞప్తిని మన్నించి విరాళాలు ఇస్తారో లేదో చూడాలి.