Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కొత్తగా ఓ అల్టిమేటం జారీ చేశారు. ఆయన తెలిపిన ప్రకారం రెండు వారాల్లో శాంతి చర్చలు ప్రారంభం కావాలని లేదంటే వేరే మార్గాన్ని అనుసరించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఓ ఇంటర్వ్యూలో శాంతి ఒప్పందం సాధ్యాసాధ్యాల గురించి ప్రశ్నించగా, ట్రంప్ “రెండు వారాల్లోనే స్పష్టత వస్తుంది, లేదంటే వేరే దారిని ఆలోచించాలి” అని వ్యాఖ్యానించారు. అయితే, ట్రంప్ ఇలా చేయడం తొలిసారి కాదు. ఇదివరకు కూడా ఇలాంటి సమయపరిమితి విధించారు. ఇంతకుముందు కూడా ఆయన ఇలాంటి రెండు వారాల టైమ్‌లైన్‌ను సూచించారు. ఈ సంవత్సరం మేలో ఆయన పుతిన్ శాంతి ఒప్పందంపై నిజంగా సీరియస్‌గా ఉన్నారా లేదా అన్నది రెండు వారాల్లో తేలుస్తానని చెప్పారు. ఆ సమయానికీ పుతిన్ స్పందించకపోతే వేరే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.
Telangana Bandh: ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమం.. నేడు తెలంగాణ బంద్!
గతంలో అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్, అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే ఒక రోజులోనే యుద్ధాన్ని ఆపుతానని హామీ ఇచ్చారు. అయితే, ఇప్పటి వరకు ఆ వాగ్దానం అమలు కాలేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 2022 ఫిబ్రవరి నుంచి కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 4 లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. అందులో రష్యాలో సైనికులతో సహా సుమారు 2.5 లక్షల మంది, ఉక్రెయిన్‌లో ఒక లక్ష మందికిపైగా మరణించినట్లు అంచనాలు. ఇటీవల ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఆగస్టు 15న అలాస్కాలో సమావేశమయ్యారు. కానీ, ఆ చర్చల్లో ఎలాంటి ఫలితం రాలేదు. ఆ తర్వాత ఆగస్టు 18న ఆయన వైట్ హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీతో పాటు యూరోపియన్ దేశాల నేతలతో సమావేశమయ్యారు.
Off The Record: ఎన్నికల తర్వాత స్థానిక నేతలను పట్టించుకోని కమలనాథులు
ఈ చర్చల అనంతరం పుతిన్-జెలెన్స్కీ ప్రత్యక్షంగా శాంతి చర్చలకు రావచ్చనే అంచనాలు మొదలయ్యాయి. అయితే జెలెన్స్కీ, రష్యా శాంతి చర్చల నుండి తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. రష్యా యుద్ధం ఆగిపోవాలని కోరుకోవడం లేదని అన్నారు. మరోవైపు రష్యా మాత్రం, ఉక్రెయిన్ దీర్ఘకాల శాంతి కోరుకోవడం లేదని.. భద్రతా హామీలు డిమాండ్ చేస్తోందని ఆరోపించింది. రష్యా ఇప్పటికే ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు ఇవ్వడాన్ని ఎప్పటినుంచో వ్యతిరేకిస్తోంది.
