Doctor Nannapaneni Ravali Saves Boy Life: అప్పటివరకు ఎంతో చలాకీగా ఆడుకుంటున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు ఎంత పిలిచినా ఉలుకూ పలుకూ లేకపోవడంతో వారి గుండె ఆగినంత పనైంది. దుఃఖాన్ని దిగమింగి ఆ బాలుడిని భుజాన వేసుకొని ఆస్పత్రికి పరుగులు తీశారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వైద్యురాలు ఆ తల్లిదండ్రుల ఆవేదనను తెలుసుకొని చిన్నారికి ఊపిరిపోసేందేకు ప్రయత్నించింది. రోడ్డుపైనే బాలుడికి సీపీఆర్ అందించగా.. ఆ బాలుడు మళ్లీ ఊపిరితీసుకున్నాడు. విజయవాడలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలుడి ప్రాణాలు రక్షించిన డాక్టర్ రవళిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. బాలుడి ప్రాణాలు నిలిపిన వైద్యురాలు రవళి ఎన్టీవీతో మాట్లాడారు.
Read Also: Vijayawada: రోడ్డుపైనే బాలుడికి సీపీఆర్.. ప్రాణాలు కాపాడిన వైద్యురాలు
సీపీఆర్ గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని డాక్టర్ నన్నపనేని రవళి చెప్పారు. తాను రోడ్డుపై అచేతనంగా పడి ఉన్న సాయిని చూసిన వెంటనే సీపీఆర్ చేశానని.. సీపీఆర్ చేయటం వల్ల ప్రాణాలను కాపాడే అవకాశం ఎక్కువ అని ఆమె వెల్లడించారు. పిల్లాడి ప్రాణం కాపాడటం ఆనందంగా ఉందన్నారు. సుమారు 5 నిమిషాల పాటు సీపీఆర్ చేశానన్నారు. కరెంట్ షాక్ కొట్టిన సందర్భంలోనే కాదు వేరే సందర్భాల్లో కూడా సీపీఆర్ చేయటం వల్ల ప్రాణాలని ఆస్పత్రికి తీసుకు వెళ్ళే లోపు కాపాడే అవకాశం ఉంటుందన్నారు. ఓ వైద్యురాలిగా తన పని తాను చేశానని ఆమె చెప్పుకొచ్చారు.