శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం గేమ్ చేంజర్. అనేక వాయిదాలు తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. మొదటి ఆట నుంచి మంచి టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా నుంచి అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే. ఈ సినిమాలో చాలామంది హీరోలు నటించారు. ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ అయినా అనేక పాత్రలలో గతంలో కొన్ని సినిమాలలో హీరోగా నటించిన వారు కనిపించడం గమనార్హం. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటించగా.. ఆయన తమ్ముడి పాత్రలో గతంలో కేరింత సినిమాలో హీరోగా నటించిన విశ్వంత్ కనిపించాడు. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో ఎస్ జె సూర్య కనిపించగా.. ఆయన గతంలో న్యూ అనే సినిమాలో హీరోగా నటించారు. ఇక సూర్య అనుచరుడి పాత్రలో మరో హీరో నవీన్ చంద్ర కనిపించాడు.
ఇక ముఖ్యమంత్రి పాత్రలో శ్రీకాంత్ కనిపించగా.. ఆయన గతంలో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించారనే సంగతి తెలిసిందే. నటుడిగా మారిన దర్శకుడు సముద్రఖని కూడా కొన్ని సినిమాలలో హీరోగా నటించారనే సంగతి తెలిసిందే. సముద్రఖని ఈ సినిమాలో శ్రీకాంత్ అనుచరుడి పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాలో సీనియర్ నరేష్.. రామ్ చరణ్ పెంపుడు తండ్రి పాత్రలో నటించాడు. నరేష్ గతంలో ఎన్నో సినిమాలు హీరోగా చేశారనే సంగతి తెలిసిందే. మలయాళ హీరో జయరాం ఈ సినిమాలో సూర్య సోదరుడి పాత్రలో కనిపించాడు. బలగం సినిమా హీరో ప్రియదర్శి ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో కనిపించాడు. రామ్ చరణ్ స్నేహితుడిగా ఆయన నటించాడు. ఇక గతంలో కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసి హీరోగా మారి పలు సినిమాలు చేసిన సునీల్.. ఈ సినిమాలో రామ్ చరణ్ దగ్గర బంట్రోతు పాత్రలో నటించాడు.
ఇక వినాయకుడు హీరో కృష్ణుడు, మ్యూజిక్ షాప్ మూర్తి హీరో అజయ్ ఘోష్ ఇద్దరూ క్రిమినల్ మైండ్ ఉన్న బిజినెస్ మాన్లుగా కనిపించారు. సుందరం మాస్టర్ సినిమాతో హీరోగా మారిన వైవా హర్ష, అనగనగా ఓ అతిధి హీరో చైతన్య కృష్ణ కూడా ఈ సినిమాలో రామ్ చరణ్ స్నేహితులుగా కనిపించారు. వివాహ భోజనంబు సినిమాతో హీరోగా మారిన కమెడియన్ సత్య.. హీరోగా పలు సినిమాలు చేసిన కమెడియన్లు వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, పృథ్వి కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. ఆ లెక్కన చూస్తే ఒక సినిమా అయినా హీరోగా నటించిన వారందరినీ లెక్క వేస్తే ఈ సినిమాలో రామ్ చరణ్ కాకుండా 17 మంది నటించారన్నమాట.