NTV Telugu Site icon

DK. Shivakumar: బీజేపీ బెదిరింపులకు భయపడం

Siva Kumar

Siva Kumar

కర్ణాటక (Karnataka)లో అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ ఎంపీ డీకే.సురేష్ (DK.Suresh) చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ కాల్చి చంపాలంటూ బీజేపీ నేత ఈశ్వరప్ప (Eswarappa) చేసిన వ్యా్ఖ్యలపై డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ (DK Shivakumar) మండిపడ్డారు. డీకే సురేష్‌ ఇలాంటి బెదిరింపులకు భయపడే వ్యక్తి కాదని..ఇలాంటివి తాము గతంలో చాలా చూశామని చెప్పుకొచ్చారు.

కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో దక్షిణాదికి నిధులు సరిగా దక్కకపోవడంపై డీకే సురేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని ఉత్తర, దక్షిణ భారత దేశాలుగా విభజించాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపాయి. పార్లమెంట్ వేదికగా జాతీయ పార్టీల మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఇక సురేష్ వ్యాఖ్యలపై స్పందించిన ఈశ్వరప్ప.. డీకే సురేష్‌, ఎమ్మెల్యే వినయ్‌ కులకర్ణి లాంటి వాళ్లను కాల్చి చంపేందుకు చట్టం చేయాల్సిందిగా ప్రధాని మోడీకి (PM Modi) చెబుతానన్నారు.

ఇక కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge).. డీకే సురేష్‌ వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్‌ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలను సమర్థించదని తేల్చి చెప్పారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ ఈశ్వరప్పకు కొట్టడం, తిట్టడం, కాల్చడం తప్ప ఏమీ తెలియదన్నారు. ఇకపోతే ఈశ్వరప్పపై చట్టపరమైన చర్యలుంటాయని చెప్పారు.

డీకే సురేష్‌ను కాల్చి చంపాలన్నందుకు ఈశ్వరప్పపై బెంగళూరులో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. దీనిపై ఈశ్వరప్ప స్పందిస్తూ జాతీయవాదం, హిందుత్వ అంశాల్లో తనపై వందల ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనా భయపడనని స్పష్టం చేశారు.