దివాళీ పండగ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ముహూర్త్ ట్రేడింగ్లో భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో శుభారంభం చేశాయి. హిందూ నూతన సంవత్సరం ‘సంవత్ 2083’కు స్టాక్ మార్కెట్ సూచీలు పచ్చని రంగుతో (లాభాలతో) స్వాగతం పలికాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పెట్టుబడిదారుల కొనుగోళ్ల ఉత్సాహంతో బెంచ్ మార్క్ సూచీలు బలమైన ర్యాలీని నమోదు చేశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (BSE) సూచీ సెన్సెక్స్ 210 పాయింట్లకు పైగా పెరిగి ఊపందుకోగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) సూచీ నిఫ్టీ 25,070 కీలక స్థాయిని అధిగమించి ముందుకు సాగింది.
ఈ ప్రత్యేక సెషన్లో మెటల్, ఫార్మా, బ్యాంకింగ్ రంగాల షేర్లకు పెట్టుబడిదారుల నుంచి తీవ్ర డిమాండ్ లభించింది. ముఖ్యంగా టాటా స్టీల్, సన్ ఫార్మా షేర్లలో భారీగా కొనుగోళ్ల జోరు కనిపించింది. వీటితో పాటు అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు కొనుగోలుదారుల ఆసక్తితో లాభాల్లో పయనించాయి. అయితే.. మార్కెట్ లాభాల్లో సాగినప్పటికీ కొన్ని ప్రధాన కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. విమానయాన సంస్థ ఇండిగో, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లు అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. అలాగే ట్రెంట్, ఏషియన్ పెయింట్స్ షేర్లు కూడా క్షీణతను నమోదు చేసి రమారమి నష్టాల బాట పట్టాయి. మొత్తానికి, దీపావళి ముహూర్త్ ట్రేడింగ్ సెషన్ ఇన్వెస్టర్లకు నూతన సంవత్సరంలో సానుకూల సంకేతాలను ఇస్తూ, మార్కెట్ సూచీలు లాభాల బాటలో ముగియడం విశేషం.

