Mamnoor Airport: వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్ట్ విస్తరణ కోసం భూసేకరణ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ పరిహారం విషయంలో రైతులు, అధికారులు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఎకరానికి మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తుండగా.. అధికారులు భూసేకరణ నిబంధనల ప్రకారం మాత్రమే పరిహారం అందించగలమని స్పష్టం చేస్తున్నారు. దీనితో తమ భూములకు సరైన పరిహారం అందాలని రైతులు పట్టుబడుతున్నారు. ఎకరానికి రూ. 2 కోట్లు చెల్లించాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, అధికారులు మాత్రం రైతులకు ఎకరానికి రూ. 60 లక్షలు మాత్రమే అందిస్తామని తేల్చి చెప్పారు. ఈ ధర గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Kiren Rijiju: రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ..
ఈ నేపథ్యంలో, రైతుల డిమాండ్‌పై రెవెన్యూ అధికారులు స్పష్టత ఇచ్చారు. భూసేకరణ నిబంధనల మేరకు ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం మాత్రమే చెల్లిస్తామని, రైతుల డిమాండ్‌ను న్యాయపరంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు వరంగల్ కలెక్టర్‌ను కలిసి చర్చించేందుకు ప్రయత్నించారు. మామునూరు ఎయిర్‌పోర్ట్ విస్తరణ కోసం భూములను కోల్పోతున్న రైతులు వరంగల్ కలెక్టరేట్‌కు వెళ్లి అధికారులతో చర్చలు జరిపారు. అయితే కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ కలెక్టర్‌తో రైతుల సమావేశం జరిగింది. ఈ చర్చల్లో అధికారులు రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం వివరాలను తెలియజేశారు.
రైతులు కోరిన పరిహారం చెల్లించడం సాధ్యపడదని అధికారులు తెలియజేయడంతో చర్చలు విజయవంతం కాలేదు. రెండు గంటలపాటు జరిగిన చర్చలు ఎలాంటి నిర్ణయానికి రాకుండానే ముగిశాయి. రైతులు మార్కెట్ రేటుకు తగ్గట్లుగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా.. ప్రభుత్వం తన నిర్ణయంపై కట్టుబడి ఉంది. భూములను కోల్పోతున్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం మరింత సమగ్రంగా ఆలోచించాలని రైతులు కోరుతున్నారు. భూసేకరణ ప్రక్రియకు సంబంధించి ఇంకా ప్రభుత్వం ఏమేరకు స్పందిస్తుందో చూడాలి.