NTV Telugu Site icon

Andhra Pradesh: పీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ రిజ‌ర్వేష‌న్‌పై రేపు చ‌ర్చలు

Andhra Pradesh

Andhra Pradesh

Andhra Pradesh: పీజీ వైద్య విద్యలో ఇన్‌స‌ర్వీస్ రిజ‌ర్వేష‌న్ విష‌యానికి సంబంధించి రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్‌తో బుధ‌వారం నాడు స‌మావేశానికి ఆంధ్రప్రదేశ్ పీహెచ్సీ డాక్టర్ల సంఘం ప్రతినిధుల్ని మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. ఈ మేర‌కు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మిష‌న‌ర్ సి.హ‌రికిర‌ణ్ సంఘం ప్రతినిధుల‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం స‌మాచారాన్ని అందించారు. ఈ స‌మావేశానికి ముందు ఈ విద్యా సంవ‌త్సరంలో జాతీయ మెడిక‌ల్ కౌన్సిల్ నిర్వహించిన పీజీ నీట్ ప‌రీక్షలో అర్హత పొందిన ప్రభుత్వ ఎంబీబీఎస్ డాక్టర్ల వివ‌రాల్ని కూడా తెలియ‌జేయాల‌ని సంఘం ప్రతినిధుల్ని క‌మిష‌న‌ర్ కోరారు.

Read Also: CM Chandrababu: నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల విడుదలపై సీఎం ఆదేశం

ఈ ఏడాది ఇన్‌స‌ర్వీస్ రిజ‌ర్వేష‌న్ కింద పీజీ కోర్సుల్లో అడ్మిష‌న్లు పొంది పీజీ పూర్తి చేసుకుని, 2027లో వీరంతా తిరిగి ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో విధుల్లో చేరాల్సి ఉంది. ఆ స‌మ‌యానికి వివిధ స్పెష‌లిస్ట్ విభాగాల్లో ల‌భ్యం కానున్న ఖాళీల‌పై మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు మదింపు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ ఏడాది పీజీ నీట్ ప‌రీక్షలో అర్హత పొందిన‌వారి స‌మాచారం మేర‌కు పీహెచ్సీ డాక్టర్ల డిమాండ్లను ప‌రిశీలించి ప‌రిష్కరించాల‌ని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

పీహెచ్సీ డాక్టర్ల డిమాండ్‌పై మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్‌, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి ఎం.టి.కృష్ణబాబు, కమిష‌న‌ర్ సి.హ‌రికిర‌ణ్‌, డీఎంఈ డాక్టర్ న‌ర‌సింహం, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి బుధవారం సచివాలయంలో చ‌ర్చించారు. ఇదే విష‌యంపై కృష్ణబాబు గ‌త శుక్రవారం నాడు రాష్ట్ర పీహెచ్సీ డాక్టర్ల సంఘం ప్రతినిధుల‌తో చ‌ర్చించారు.