NTV Telugu Site icon

Glass Symbol: జనసేనకు హైకోర్టులో దక్కని ఊరట.. గాజు గ్లాసు సింబల్‌పై ఈసీ కీలక నిర్ణయం

Glass Symbol

Glass Symbol

Glass Symbol: గాజు గ్లాసు సింబల్‌పై జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో నిరాశే ఎదురైంది.. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది జనసేన.. ఆ పిటిషన్ పై నిన్న, ఈ రోజు కూడా వాదనలు జరిగాయి.. అయితే, నిన్న హైకోర్టును 24 గంటల సమయం కోరిన ఎన్నికల కమిషన్‌.. ఈ రోజు కీలక విషయాలను వెల్లడించింది.. జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్న పార్లమెంట్ స్థానాల్లో.. గాజు గ్లాసు గుర్తును ఎంపీ అభ్యర్థులకు ఇవ్వబోమని స్పష్టం చేసింది ఈసీ.. జనసేన పోటీ చేస్తున్న 2 పార్లమెంట్ స్థానాల పరిధిలో పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల్లోనూ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించమని కోర్టుకు తెలిపింది ఎన్నికల కమిషన్‌.. గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఇలా చేస్తామని పేర్కొంది ఎన్నికల కమిషన్‌.. దీంతో.. జనసేన పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో ఆ పార్టీకి కాస్త ఊరట లభించినట్టు అయినా.. మిగతా స్థానాల్లో మాత్రం జనసేన ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది.

అయితే, తాము పోటీ చేసే స్థానాల్లో మాత్రమే కాకుండా మిగతా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో కూడా గాజు గ్లాసు గుర్తు వేరేవారికి కేటాయించ వద్దని హైకోర్టును కోరింది జనసేన.. కానీ, గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్ లో ఈసీ పెట్టిన నేపథ్యంలో అలా అన్ని చోట్లా ఇవ్వటం ఎలా సాధ్యమని న్యాయస్థానం ప్రశ్నించింది.. జనసేన పిటిషన్ డిస్పోజ్ చేసింది.. ఎన్నికల కమిషన్‌ నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే వేరే పిటిషన్ వేసుకోవాలని సూచించింది ఏపీ హైకోర్టు. దీంతో, జనసేన పార్టీకి హైకోర్టులో షాక్‌ తగిలినట్టు అయ్యింది.. అయితే, జనసేన-బీజేపీ-టీడీపీ కూటమి నుంచి పోటీ చేస్తున్న మిగతా స్థానాల్లో గాజు గ్లాసు సింబల్‌ ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది వేచిచూడాలి.

కాగా, గాజు గ్లాస్‌ సింబల్‌ను ఎన్నికల కమిషన్‌ ఫ్రీ సింబల్‌ జాబితాలో చేర్చడంతో.. జనసేనకు టెన్షన్ మొదలైంది.. ఆయా నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్‌ సింబల్ కేటాయించింది.. అయితే, ఈ పరిణామాలపై హైకోర్టు మెట్లు ఎక్కింది జనసేన పార్టీ.. గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర్య అభ్యర్థులకు కేటాయించడాన్నరి సవాల్ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసింది.. మంగళవారం రోజు ఏపీ హైకోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి.. జనసేన పార్టీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రెండు ప్రధాన పార్టీలతో జనసేన ఎన్డీయేలో పొత్తులో ఉంది.. అందుకే మేం అన్ని చోట్లా కాకుండా కొన్నిచోట్ల మాత్రమే పోటీకి దిగాం.. మిగతా చోట్ల పొత్తులో ఉన్న వేరే పార్టీల అభ్యర్థుల గెలుపునకు ప్రచారం చేస్తున్నాం.. ఈ సమయంలో గాజు గ్లాసు గుర్తును స్వతంత్య్ర అభ్యర్థులకు ఇవ్వటం వల్ల ప్రజల్లో కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది.. గుర్తింపు పొందిన 2 పార్టీలతో జనసేన పార్టీ పొత్తులో ఉంది.. మేం పొత్తులో లేకపోతే జనసేన పోటీ చేయని చోట సింబల్ వేరే వారికి ఇస్తే ఇబ్బంది లేదు.. కానీ, ఇప్పుడు జరుగుతోంది అంతా ఎన్నికల వ్యవహారంలో భాగమే అని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక, టీడీపీ, బీజేపీతో జనసేన పొత్తులో ఉన్న కారణంగా 2 ఎంపీ, 21 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేస్తున్నామని.. మిగతా సీట్లలో మా పొత్తులో ఉన్న టీడీపీ, బీజేపీ పోటీ చేస్తున్నాయి కాబట్టి ఆ స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలని కోరినట్టు కూడా కోర్టుకు వివరించారు.. అయితే, 24 గంటల్లో జనసేన పార్టీ అభ్యంతరాలపై నిర్ణయం ఉంటుందని ఈ సందర్భంగా హైకోర్టుకు తెలిపింది ఎన్నికల కమిషన్‌.. దీంతో.. జనసేన పిటిషన్ పై తదుపరి విచారణ ఇవాళ్టికి వాయిదా పడగా.. ఈ రోజు గాజు గ్లాసు సింబల్‌పై తమ నిర్ణయాన్ని హైకోర్టుకు వివరించింది ఎన్నికల కమిషన్‌.

Show comments