NTV Telugu Site icon

Rohit Sharma: 2027 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడతాడు!

Rohit Sharma Trolls

Rohit Sharma Trolls

Rohit Sharma To Play World Cup 2027: టీ20 ప్రపంచకప్‌ 2024 అనంతరం రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. హిట్‌మ్యాన్ ప్రస్తుతం వన్డే, టెస్టులు ఆడుతున్నాడు. 2023-25 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో టీమిండియా ఫైనల్‌ చేరే అవకాశముంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ తర్వాత వన్డేలు, టెస్టులకు రోహిత్ వీడ్కోలు పలుకుతాడని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే హిట్‌మ్యాన్ చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ స్పందించారు. 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ ఆడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

దైనక్ జాగరణ్‌ ఇంటరాక్షన్‌లో దినేశ్ లాడ్ మాట్లాడుతూ… ‘ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని నేను చెప్పడం లేదు. వయసు మీద పడుతున్నందున టెస్టు క్రికెట్‌కు అతడు వీడ్కోలు పలుకుతాడని నాకు అనిపిస్తోంది. వన్డే క్రికెట్‌కు ఫిట్‌గా ఉండాలనే కోరిక కూడా దీనికి కారణం కావచ్చు. 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ ఆడతాడని నేను 100 శాతం నమ్ముతున్నా. హిట్‌మ్యాన్ క్రికెట్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. కొన్ని ఇన్నింగ్స్ నమ్మశక్యంగా ఉండవు’ అని అన్నారు.

దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడతాడా? అనేది పెద్ద ప్రశ్న. అప్పటికి హిట్‌మ్యాన్ వయసు 40 అవుతుంది. ఒకవేళ రోహిత్ మెగా ఈవెంట్లో ఆడితే.. వన్డే గేమ్ ఆడిన అతి పెద్ద వయసు భారతీయ ఆటగాడిగా రికార్డుల్లో నిలుస్తాడు. వన్డే ప్రపంచకప్ గెలవడమే తన కోరిక అని రోహిత్ చాలాసార్లు చెప్పిన విషయం తెలిసిందే. 2015, 2019, 2023 వన్డే ప్రపంచకప్‌లో హిట్‌మ్యాన్ ఆడాడు.

Show comments