NTV Telugu Site icon

Dinesh Karthik: మళ్లీ బ్యాట్ పట్టనున్న దినేష్ కార్తీక్.. తొలి క్రికెటర్‌గా రికార్డు!

Dinesh Karthik Sa 20 League

Dinesh Karthik Sa 20 League

Dinesh Karthik is 1st Indian Player to play in SA 20 League: గత జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్ రాయల్స్‌ జట్టు తరఫున కార్తీక్ బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని పార్ల్ రాయల్స్ మేనేజ్‌మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడనున్న మొదటి భారత ఆటగాడిగా డీకే రికార్డుల్లో నిలవనున్నాడు.

2004 సెప్టెంబర్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన దినేష్ కార్తీక్‌.. భారత్ తరపున చివరగా టీ20 ప్రపంచకప్‌ 2022లో ఆడాడు. భారత్ తరఫున 26 టెస్టుల్లో 1025, 94 వన్డేల్లో 1752, 60 టీ20ల్లో 686 పరుగులు చేశాడు. కీపర్‌గా 172 ఔట్లలో పాలు పంచుకున్నాడు. డీకే ఐపీఎల్‌‌లో తనదైన ముద్ర వేశాడు. 257 మ్యాచ్‌లాడి 4842 పరుగులు సాధించాడు. ఐపీఎల్ 2024లో ఆర్‌సీబీ తరఫున ఆడిన డీకే.. సీజన్ అనంతరం రిటైర్మెంట్ ఇచ్చాడు.

Also Read: T20 World Cup 2024: టీ20 ప్రపంచక‌ప్‌ 2024పై నీలినీడ‌లు.. షార్ట్‌లిస్ట్‌లో భారత్!

ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో దినేష్ కార్తీక్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు జరిగిన 17 ఎడిషన్‌లలో పాల్గొన్న డీకే.. కేవలం రెండు మ్యాచ్‌లను మాత్రమే మిస్‌ అయ్యాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ (2008, 2009, 2010), కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ (2011), ముంబై ఇండియన్స్‌ (2012, 2013), ఢిల్లీ క్యాపిటల్స్‌ (2014), ఆర్‌సీబీ (2015), గుజరాత్‌ లయన్స్‌ (2016, 2017), కేకేఆర్‌ (2018, 2019, 2020, 2021), ఆర్‌సీబీ (2022, 2023, 2024)కి ఆడాడు. ఇక ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌గా, మెంటార్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ప్రస్తుతం స్కై స్పోర్ట్స్‌ తరఫున 100 ఫార్మట్ మ్యాచ్‌లకు కామెంటేటర్‌గా ఉన్నాడు.

Show comments