NTV Telugu Site icon

MS Dhoni: ఇండియా ఆల్‌టైమ్ ఎలెవన్.. ఎంఎస్ ధోనీకి దక్కని చోటు!

Ms Dhoni

Ms Dhoni

Dinesh Karthik’s All-Time India XI : 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత మాజీ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ దినేష్ కార్తీక్ తన ఆల్‌టైమ్ ఇండియా ఎలెవన్‌ను ప్రకటించాడు. మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేశాడు. భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన ఏకైక కెప్టెన్ అయిన ఎంఎస్ ధోనీకి జట్టులో డీకే చోటివ్వకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. తన జట్టుకు వికెట్ కీపర్‌గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను ఎంచుకున్నాడు. ఇక 12వ ఆటగాడిగా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను తీసుకున్నాడు.

దినేశ్ కార్తీక్ తన ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లకు అవకాశం ఇచ్చాడు. వీరేంద్ర సెహ్వాగ్‌, రోహిత్ శర్మలను ఓపెనర్లుగా ఎంచుకున్న డీకే.. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్‌లను మిడిలార్డర్ బ్యాటర్లుగా తీసుకున్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజాను ఎంపిక చేసిన కార్తీక్.. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లేలకు జట్టులో చోటిచ్చాడు. జహీర్ ఖాన్‌, జస్ప్రీత్ బుమ్రాలను పేస్ కోటాలో అవకాశం కల్పించాడు.

క్రిక్‌బజ్‌తో ఒక ఇంటరాక్షన్‌లో దినేష్ కార్తీక్ మాట్లాడుతూ తన ఇండియా ఆల్‌టైమ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. ప్రస్తుతం భారత జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్న గౌతమ్ గంభీర్‌ను కూడా డీకే పక్కన పెట్టాడు. గంభీర్ లాంటి చాలా మంది ఆటగాళ్లకు జట్టులో చోటివ్వకపోవడం బాధగా ఉందని డీకే పేర్కొన్నాడు. అయితే మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ అండ్ బ్యాటర్ అయిన ఎంఎస్ ధోనీకి చోటు ఇవ్వకపోవడంతో డీకేపై అభిమానులు అందిపడుతున్నారు.

దినేశ్ కార్తీక్ ఇండియా ఆల్‌టైమ్ ఎలెవన్:
వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్. (హర్భజన్ సింగ్‌-12వ ఆటగాడు)

 

Show comments