Site icon NTV Telugu

Dinesh Karthik: దినేష్‌ కార్తిక్ సంచలన నిర్ణయం!.. ప్లీజ్‌ డీకే.. వద్దంటున్న ఫ్యాన్స్

Dinesh Karthik

Dinesh Karthik

Dinesh Karthik: భారత వికెట్ కీపర్-బ్యాటర్ దినేష్ కార్తీక్ ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ క్రికెట్ అభిమానులను గందరగోళానికి గురిచేసింది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ గురించి కార్తీక్ ఆలోచిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా కార్తీక్‌ పోస్ట్‌ చేసిన ఓ వీడియోతో ఈ వార్తలకు మరింత ఊతమిచ్చినట్లైంది. ప్రపంచకప్‌లో ఆడాలన్న తన కలను నెరవేర్చుకోవడంలో సహకరించిన సహచర ఆటగాళ్లు, కోచ్‌లకు, తన అభిమానులకు కార్తీక్‌ కృతజ్ఞతలు తెలిపాడు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కార్తీక్‌ భావోద్వేగ వీడియోను పంచుకున్నాడు. 2019 ప్రపంచ కప్‌ తర్వాత కార్తిక్‌ కెరీర్‌ ముగిసిందని చాలా మంది అనుకున్నారు.. కానీ 2022లో ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసి తన కెరీర్‌ను పునరుద్ధరించుకున్నాడు డీకే. అయితే ఫినిషర్‌గా టీ20 ప్రపంచకప్‌ భారత జట్టులో చోటు దక్కించుకున్న కార్తీక్‌.. అంచనాలకు తగ్గట్టు రాణించడంలో విఫలమయ్యాడు. కీలక మ్యాచ్‌లలో పంత్‌ను కాదని డీకేకు అవకాశం ఇచ్చినప్పటికీ సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యాడు. దీంతో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు కార్తీక్‌ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు.

“టీమ్​ఇండియా తరఫున టీ20 ప్రపంచకప్‌ ఆడాలనే లక్ష్యం కోసం చాలా కష్టపడ్డాను. ఇప్పుడు ఆ కప్‌ కోసం ఆడడం చాలా గర్వంగా ఉంది. ఈ టోర్నీలో మేము విజయం సాధించకపోవచ్చు కానీ అది నా జీవితంలో చాలా జ్ఞాపకాలను నింపింది. నా తోటి ఆటగాళ్లు, కోచ్‌లు, స్నేహితులు మరియు ముఖ్యంగా అభిమానులకు ఎనలేని మద్దతునిచ్చినందుకు ధన్యవాదాలు.” అని కార్తీక్ క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు.

RC15: ఒక్క షెడ్యూల్ కోసం చరణ్ ఎన్ని లుక్స్ ట్రై చేస్తున్నాడు

కార్తీక్‌ పోస్ట్‌ చేసిన వీడియోపై అభిమానులు స్పందిస్తున్నారు. “ప్లీజ్‌ డీకే.. వద్దు ఇప్పుడే రిటైర్మెంట్ ప్రకటించకు..” అంటూ కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే దినేష్ కార్తిక్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు సంకేతాలు ఇచ్చాడని మరికొంత మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ సన్నాహాకాల్లో భాగంగా భారత్‌ ఎక్కువగా వన్డే సిరీస్‌లు ఆడనుంది. కాబట్టి కార్తీక్‌ కెరీర్‌ దాదాపు ముగిసినట్టే అని చెప్పుకోవాలి. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌కు కార్తీక్‌ కూడా గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా కార్తీక్ భారత్‌ తరపున 60 టీ-20 మ్యాచ్‌లు ఆడాడు. ఒక అర్ధ సెంచరీతో పాటు 686 పరుగులు చేశాడు. వన్డేలలో కార్తీక్ 94 మ్యాచ్‌లు ఆడాడు. టీ20 ప్రపంచకప్‌లో కార్తీక్ పేలవ ప్రదర్శన చేశాడు. భారత్‌ ప్రారంభ ఆటలో పాకిస్తాన్‌పై కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. దక్షిణాఫ్రికాపై ఆరు పరుగుల ఇన్నింగ్స్‌తో దానిని అనుసరించాడు. అతను బంగ్లాదేశ్‌తో తన చివరి మ్యాచ్‌ను ఆడి కేవలం ఏడు పరుగులు చేయగలిగాడు. 2024లో జరిగే తదుపరి టీ20 ప్రపంచకప్‌తో కార్తీక్‌కు మళ్లీ భారత జట్టులో అవకాశం లభించే అవకాశం లేదు, ముఖ్యంగా సెలెక్టర్లు యువ క్రికెటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

Exit mobile version