NTV Telugu Site icon

Kurnool TDP: టీడీపీకి తలనొప్పిగా కర్నూలు.. ఐదు నియోజకవర్గాల్లో అదే తీరు..!

Tdp

Tdp

Kurnool TDP: ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు పతాకస్థాయికి చేరుకుంటున్నాయి. ఆ పార్టీకి 2019 ఎన్నికల్లో జిల్లా నుంచి ఒక్క అసెంబ్లీ సీటు కూడా దక్కలేదు. ఈ ఎన్నికల్లోనూ విభేదాలు పార్టీని దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. ఐదు నియోజకవర్గాల్లోని నేతలు ఈ ఎన్నికల్లో కలిసి పనిచేయటంలేదు. నంద్యాల నియోజకవర్గంలో మాజీ మంత్రి ఫరూక్‌ను అభ్యర్థిగా ప్రకటించిన తరువాత ఇంచార్జి భూమా బ్రహ్మానంద రెడ్డి రాజీనామాకు సిద్ధపడ్డారు. ఐతే.. అధిష్టానం నచ్చచెప్పి ఇద్దరినీ కలిపింది. ఆ తరువాత ఒక్కరోజు కూడా వాళ్లు కలిసి ప్రచారం చేయలేదు. భూమా బ్రహ్మానంద రెడ్డి తన ప్రచారంలో ఎక్కడా ఫరూక్ పేరు ప్రస్తావించటంలేదు.

Read Also: Virat Kohli: ‘ఛీటర్-ఛీటర్’ అంటూ నినాదాలు.. కోహ్లీ హృదయాన్ని ముక్కలు చేసిన భారత ఫాన్స్!

ఇక.. ఆలూరు నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించనప్పటికీ అక్కడ ఉన్న నాలుగు గ్రూపులు కలిసి పనిచేసే పరిస్థితి లేదు. కోట్ల సుజాత, వైకుంఠం జ్యోతి, వైకుంఠం ప్రసాద్, వీరభద్ర గౌడ్ మధ్య గ్రూపు తగాదాలున్నాయి. మాజీ మంత్రి గుమ్మనూరు జయరామ్ చేరిన తరువాత టీడీపీలో ఇక్కడ ఐదో గ్రూపు తయారైంది. అటు.. ఆదోనిలోనూ మీనాక్షి నాయుడుకు, వ్యతిరేకవర్గం తయారైంది. అదోని టికెట్ టీడీపీకే వస్తుందా? లేదా? అనే సందేహం ఉన్న దశలోనూ వర్గ విబేధాలు వీడలేదు. మీనాక్షి నాయుడు వద్దంటూ గతంలో అధిష్టానానికి వ్యతిరేకవర్గం ఫిర్యాదు చేసింది. మరోవైపు.. ఎమ్మిగనూరులో టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వర రెడ్డికి వ్యతిరేకవర్గం సహకరించడం లేదు. గోనెగండ్ల, ఎమ్మిగనూరు టౌన్, రూరల్‌లో కొందరు మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు ఇంకా ప్రచారానికే వెళ్లడంలేదు.

Read Also: Shiv Sena: ఈ రోజే శివసేన-యూబీటీ తొలి జాబితా

మంత్రాలయం అభ్యర్థిగా రాఘవేంద్రరెడ్డిని ప్రకటించినప్పటి నుంచి ఇంచార్జి తిక్కారెడ్డి వర్గం నిరసనలు కొనసాగిస్తూనే ఉంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు సైతం సిద్ధమయ్యారు తిక్కారెడ్డి. కోడుమూరులో మాజీ ఇంచార్జి విష్ణువర్ధన్ రెడ్డి వర్గానికి చెందిన బొగ్గుల దస్తగిరికి టికెట్ దక్కింది. దీంతో ప్రస్తుత ఇంచార్జి ఆకుపోగు ప్రభాకర్ పనిచేయడం లేదు. మొత్తం మీద టీడీపీ అధిష్టానం గొడవలపై దృష్టి సారించకుంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. వెంటనే అధిష్టానం జోక్యం చేసుకుని ఈ విభేధాలకు చెక్‌ పెట్టాలని.. అంతా కలిసికట్టుగా పనిచేసే విధంగా చర్యలు చేపట్టాలని స్థానిక నేతలు, పార్టీ కేడర్‌ కోరుతున్నారు.