NTV Telugu Site icon

KD Movie: కేజీఎఫ్ కాపీలా ధృవ సర్జా ‘కెడి’

Kd Movie

Kd Movie

KD Movie: కన్నడ నాట ఇప్పుడు పాన్ ఇండియా మేనియా నడుస్తోంది. దీనికంతటకి కారణం ‘కేజీఎఫ్’ సీరీస్. నిజానికి కేజీఎఫ్‌కి మన ‘బాహుబలి’ స్ఫూర్తి అన్నది జగద్విదితం. ఇక కేజీఎఫ్ తర్వాత కన్నడ చిత్రరంగంలో కూడా పలువురు పాన్ ఇండియా బాట పట్టారు. ఒకరిద్దరు తప్ప అందరూ బొక్కబోర్లా పడ్డారు. ఇప్పుడు ధృవ సర్జా హీరోగా దర్శకుడు ప్రేమ్ కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై ‘కెడి’ అనే సినిమా రూపొందిస్తున్నారు. దీనికి ముందు కూడా ధృవ సర్జా ‘పొగరు’ పేరుతో పాన్ ఇండియా సినిమా చేసి నిరాశాజనకమైన ఫలితాన్ని అందుకున్నారు. అలాగే దర్శన్ ‘రాబర్డ్’, రక్షిత్ శెట్టి ‘అతడే శ్రీమన్నారాయణ, 777 ఛార్లీ’, ఉపేంద్ర ‘ఐ లవ్ యు’ సినిమాలతో పాన్ ఇండియా ఆడియ్స్ ముందుకు వచ్చారు. వీటిలో ఒక్క ‘777 చార్లీ’ మాత్రమే కమర్షియాలిటీని పక్కన పెడితే హార్ట్ టచింగ్ మూవీగా పేరు తెచ్చుకుంది. ఇక పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత ‘జేమ్స్’తో వచ్చాడు. ఒక్క కన్నడ నాట మాత్రమే ఆకట్టుకోగలిగాడు. తాజాగా రిషబ్ షెట్టి ‘కాంతారా’ సినిమా ముందు ఇంట గెలిచి ఆ తర్వాత రచ్చ ఇంటిలో విజయవిహారం చేస్తోంది.

Pooja Hegde: బుట్టబొమ్మ కాలికి గాయం.. ఆందోళనలో మహేష్ ఫ్యాన్స్

ఇప్పుడు ధృవ సర్జా ‘కెడి’ సినిమా కూడా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. గురువారం ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ ఆసాంతం ‘కేజీఎఫ్’, ‘పుష్ప’ ఛాయల్లోనే సాగటం విశేషం. ఇక ఈ టీజర్ ను తమిళంలో విజయ్ సేతుపతి, మలయాళంలో మోహన్ లాల్, హిందీలో సంజయ్ దత్ విడుదల చేశారు. ఇక ఇందులో తెలుగు, తమిళ స్టార్స్ కూడా ఉంటారని చెప్పారు. ఈ సినిమా హీరోయిన్ ను ఇప్పటి వరకూ నిర్ణయించలేదు. అయితే టీజర్ కు అరగంటలో 15 మిలియన్స్ వ్యూస్ వచ్చాయని ప్రకటించటం గమనార్హం. ఇది కేవలం కొన్న వ్యూస్ అనే ఇట్టే అర్థం అవుతుంది. ఎందుకంటే టీజర్ లో అంత దమ్ము లేదు. పూర్తిగా కెజిఎఫ్ కి కాపీలాగే ఉంది. 1970 గ్యాంగ్ వార్ బేస్ గా ఈ సినిమా తీసినట్లు దర్శకుడు ప్రేమ్ ప్రకటించటం చూడవచ్చు. కథ మీద అంత నమ్మకం ఉంటే ‘కాంతారా’ సినిమాలా ముందు కన్నడలో రిలీజ్ చేసి ఆ తర్వాత ఇతర భాషల్లో రిలీజ్ చేస్తే బాగుంటుందేమో. లేకుంటే ముందు వచ్చిన పాన్ ఇండియా ప్లాప్ చిత్రాల జాబితాలో ఇది కూడా చేరే అవకాశం ఉంది. సో ప్రేమ్ అండ్ అర్జున్ సర్జా బి కేర్ ఫుల్…