NTV Telugu Site icon

Devineni Uma: డీజీపీకి లేఖ రాసిన దేవినేని ఉమా.. అందులో ఏముందంటే?

Devineni Uma

Devineni Uma

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు లేఖ రాశారు. మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని అనుచరులు ఎన్నికల రోజు, తర్వాత రోజు సాగించిన హింసాకాండకు సంబంధించిన ఆధారాలతో సహా అందిస్తున్నామని లేఖలో పేర్కొ్న్నారు. “మాచర్ల మండలం రాయవరం గ్రామంలోని 51వ పోలింగ్ బూత్ లో వైసీపీ గూండాలు టీడీపీ ఏజంట్లను బయటకు లాగి దాడి చేసి రిగ్గింగ్ కు పాల్పడ్డారు. ఆ సమయంలో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ రిగ్గింగ్ ను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పోలీసులు ఉదాసీనత వైఖరి వల్లే దాడి జరిగింది. బాధితులను రక్షించడంలో విఫలమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిపురం గ్రామంలో టీడీపీ ఏజంట్ రేఖ్యానాయక్ ను బూత్ నుంచి బయటకు బలవంతంగా లాక్కొచ్చి కొట్టి తీవ్రంగా గాయపర్చారు. అనంతరం వైసీపీ కార్యకర్తలు బూత్ వద్ద రాళ్ల దాడికి పాల్పడ్డారు. నరసరావుపేట నియోజకవర్గంలో జీవనోపాధికోసం పని చేసుకునే డీజే శివపై రాడ్లు, కర్రలతో దాడి చేసి వైసీపీ రౌడీలు చావబాదారు. మాచర్లలో దాడులకు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందుగానే రచించుకున్న వ్యూహానికి కొందరు పోలీసులు దన్నుగా నిలిచారు. టీడీపీ కార్యకర్తలు, ఓటర్లపై దాడులకు పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకోవాలి.” అని లేఖలో పేర్కొన్నారు.

READ MORE: AP High Court: హై కోర్టు కీలక ఆదేశాలు..పిన్నెల్లి సహా ఇతర అభ్యర్థులపై జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు

కాగా.. ఎన్నికల సందర్భంగా మాచర్లలో జరిగిన దాడికి సంబంధించి పలు వీడియోలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముందస్తు బెయిలు కోసం హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు విచారణ జరగగా.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లి సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లు మీద ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. జూన్ 5 ఉదయం 10 గంటల వరకు వారిపై ఏటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.