Site icon NTV Telugu

Flash Floods: ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తుతున్న వర్షాలు.. రెండు రోజుల్లో 30 మృతి..!

Rains

Rains

Flash Floods: ఈశాన్య భారతదేశంలో వర్షాలు తీవ్రవినాశం సృష్టిస్తున్నాయి. గత రెండు రోజుల్లో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరం రాష్ట్రాల్లో ఏర్పడిన వరదల వల్ల 30 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఒక్కరోజే 14 మంది మృతి చెందారు. ఇక అస్సాంలో 12 జిల్లాల్లో వరదలు పలు గ్రామాలను ముంచెత్తాయి. సుమారు 60,000 మంది ప్రజలు వరదల వల్ల ప్రభావితులయ్యారు. కామ్‌ రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో గత 24 గంటల్లో వరుసగా జరిగిన కొండచరియల ప్రభావం వల్ల ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

Read Also: Vivo T4 Ultra: 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో భారత్ లో లాంచ్ కి సిద్దమైన వివో T4 అల్ట్రా..!

బొండా ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు మట్టిలో పడి మరణించారని ఆ రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి జయంత మల్ల బరువా తెలిపారు. ఇక గువాహటిలో గత 67 ఏళ్లలో లేనంతగా 111 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. దీని ఫలితంగా బ్రహ్మపుత్రా సహా అనేక నదుల నీటిమట్టం పెరిగింది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల వల్ల ఏర్పడ్డ కొండచర్యలు విరిగి పడిపోవడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఈస్ట్ కమెంగ్ జిల్లాలో జరిగిన ఓ విషాద సంఘటనలో 7 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు ఒక కారులో ప్రయాణిస్తుండగా కొండచర్యలు విరిగి పడిపోవడంతో కారు లోయలోకి పడిపోయింది. దానితో అందులోని వారందరు మృతి చెందారు. ఈ ఘటనపై స్పందించిన అరుణాచల్ హోం మంత్రి మామా నటుంగ్ సోషల్ మీడియా ద్వారా తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ప్రజలను వర్షాకాలంలో రాత్రి ప్రయాణాలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Read Also: Kubera : ‘కుబేర’ నుంచి మరో సాలిడ్ ట్రీట్‌కు డేట్ ఫిక్స్

అలాగే జిరోలో పైన్ గ్రోవ్ వద్ద ఉన్న రెస్టారెంట్ వద్ద రాత్రిపూట భారీగా కొండచర్యలు విరిగి పడ్డాయి. ఇందులో లఖింపూర్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు. సంఘటన చోటు చేసుకున్న వెంటనే SDRF, ITBP బృందాలు, స్థానికులు సహాయ చర్యలు చేపట్టారు. ఇక అస్సాంలోని కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, తూర్పు భారతదేశంలో యెలో అలర్ట్ జారీ చేసినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వరదలు, కొండచర్యలు ఉధృతి తారాస్థాయికి చేరుతుండటంతో బాధితులకు సహాయక చర్యలు ముమ్మరం చేయబడ్డాయి.

Exit mobile version