Site icon NTV Telugu

Pawan kalyan: పంచాయతీరాజ్ సంస్థల్లో కారుణ్య నియామకాలపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష

Pawan Kalyan

Pawan Kalyan

Pawan kalyan: పంచాయతీరాజ్ సంస్థల్లో పనిచేసే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉద్యోగులు, వాటి పరిధిలో ఉండే ఉపాధ్యాయులు మరణిస్తే వారి వారసులకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షించారు. తన కార్యాలయానికి కారుణ్య నియామకాలుపై పలు అర్జీలు వస్తున్న దృష్ట్యా డిప్యూటీ సీఎం ఈ అంశంపై అధికారులతో సమావేశమయ్యారు. ఈ నియామకాల ప్రక్రియలో నెలకొంటున్న జాప్యం, నిబంధనలపై వివరాలు తీసుకున్నారు. మరణించిన ఉద్యోగులు పంచాయతీరాజ్ సంస్థల పరిధిలో ఉన్నందున వారి వారసులకు అదే సంస్థల్లో నియమించాల్సి ఉంటుందని, ఖాళీలు తక్కువ ఉండటంతో కారుణ్య నియామకాలు ఆలస్యం అవుతున్నాయని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా- పి.ఆర్. సంస్థలలో కారుణ్య నియామకాల జాబితాలో వేచి చూస్తున్నవారికి, జిల్లా కలెక్టర్ కామన్ పూల్‌లో ఉన్న ఖాళీలలో అవకాశం కల్పించే అంశంపై చర్చించారు. ఈ దిశగా నియమకాలు చేసే విషయంపై సాధారణ పరిపాలన శాఖతో చర్చించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కు ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

Exit mobile version