NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: అతిథులకు జ్ఞాపికలుగా హస్త కళాకారుల కళాకృతులు.. పవన్‌ కీలక నిర్ణయం

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశాలకు, వేడుకలకు రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులు, ప్రతినిధులను గౌరవించి, సత్కరిస్తారు. అదే విధంగా మన రాష్ట్రం తరఫున ఇతర రాష్ట్రాలకుగానీ, దేశ రాజధానికిగానీ వెళ్ళినప్పుడు మర్యాదపూర్వకంగా జ్ఞాపికలు ప్రదానం చేస్తారు. అలా అతిథులకు రాష్ట్ర హస్త కళాకారులు రూపొందించిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు ఇచ్చి సత్కరించాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ నిర్ణయించారు. తద్వారా రాష్ట్ర కళా సంపదకు ప్రాచుర్యం అందించడంతోపాటు హస్త కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుందనేది ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆలోచన. ఇందుకు అనుగుణంగా లేపాక్షి సంస్థలో ఉన్న కళాకృతులను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. శ్రీకాళహస్తి పెన్ కలంకారీ వస్త్రాలు, నరసాపురం లేసు, కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలతో చేసి దశావతారాలు, ధర్మవరం తోలుబొమ్మలు, బొబ్బిలి వీణ జ్ఞాపికలు, చిత్తూరు కొయ్య కళాకృతులూ, సవర గిరిజనులు వేసిన చిత్రాలు, రత్నం పెన్స్, దుర్గి రాతి బొమ్మలు, అరకు కాఫీ, మంగళగిరి శాలువాలు… ఇలా పలు కళాకృతులను పరిశీలించారు. ఎంపిక చేసినవాటితో గిఫ్ట్ హ్యాంపర్ సిద్ధం చేయించి వాటిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముద్ర, అందులో కళాకృతుల వివరాలతో కూడిన కార్డు ఉంచాలని నిర్ణయించారు.

60 శాతం ఖర్చు పవన్ కళ్యాణ్‌దే..
అతిథుల గౌరవార్థం ఇచ్చే జ్ఞాపికలు, శాలువాలకు శాఖాపరంగా బడ్జెట్ ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ తన శాఖకు కేటాయించిన సంబంధిత బడ్జెట్ నుంచి 40 శాతం మాత్రమే తీసుకొని మిగిలిన 60 శాతం తన సొంత సొమ్మును జోడించి కళాకృతులతో కూడిన గిఫ్ట్ హ్యాంపర్స్ సిద్ధపరచాలని తన పేషీ అధికారులను ఆదేశించారు.

కుమార్తె ముచ్చట తీర్చిన పవన్
లేపాక్షి సంస్థ ప్రదర్శించిన కళాకృతులను ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ తన కుమార్తె ఆద్యతో కలిసి తిలకించారు. ఆద్య అందులో కలంకారీ వస్త్రంతో చేసిన బ్యాగ్, కొయ్య బొమ్మలు చూసి ముచ్చటపడ్డారు. పవన్ కళ్యాణ్ వాటిని కొనుగోలు చేశారు. అందుకు సంబంధించి బిల్లు చెల్లించి బ్యాగ్, బొమ్మలు కొని కుమార్తెకు అందించారు.