Budi Muthyala Naidu: ఏపీ డిప్యూటీ సీఎం ఇంట్లో రాజకీయ కుంపటి రాజుకుంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది పెద్దల మాట. ఏపీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు రచ్చ గెలవగలిగినా… ఇంటి పోరు మాత్రం ఆయన్ని కలవరపెడుతోంది. కారణం.. రాజకీయ ఆధిపత్యం కోసం వారసుల మధ్య జరుగుతున్న ఫైట్. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం ఉంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ముత్యాలనాయుడు. ఆయనకు ఊహించిన దానికంటే ఉన్నత పదవులే లభించాయి. 2014లో తొలిసారి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ హోదాతో విప్ పదవి లభించింది. కేబినెట్ పునర్వ్యస్ధీకరణలో ఏకంగా ముత్యాల నాయుడిని డిప్యూటీ సీఎం చేసింది పార్టీ హైకమాండ్. ఉత్తరాంధ్రలో బలమైన బీసీ-వెలమ నేతగా ముత్యాల నాయుడికి ప్రమోషన్ ఇవ్వడం ద్వారా ఆ సామాజిక వర్గానికి దగ్గరైంది వైసీపీ.
Read Also: Konda Sangeetha Reddy: భారీ మెజార్టీతో కె.వి.ఆర్ గెలుపు ఖాయం..
ప్రస్తుత ఎన్నికల్లో తన వ్యూహానికి మరింత పదునుపెట్టిన వైసీపీ ముత్యాలనాయుడిని అనకాపల్లి లోక్‌సభ బరిలో నిలిపింది. మాడుగుల అసెంబ్లీ టికెట్ ఆయన కుమార్తె ఈర్లె అనురాధకు కేటాయించింది. తండ్రీకూతుళ్లు ఎన్నికల బరిలో దిగారు. ప్రత్యర్థులకు గట్టి పోటీ తప్పదని భావించిన సమయంలో ముత్యాలనాయుడికి సొంత కొడుకు రవి షాక్ ఇచ్చాడు. మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు రవి. ఈర్లె అనూరాధకు మహిళా కోటా, తండ్రి వారసత్వం కలిసి వచ్చి ఎమ్మెల్యే అభ్యర్ధిత్వం ఖరారైంది. అదే సమయంలో ముత్యాల నాయుడు కుమారుడు రవి తండ్రి నీడ తనపై పడకుండా రాజకీయంగా ఎదగాలని భావిస్తున్నారు. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వైసీపీలో జిల్లా నుంచి రాష్ట్రస్ధాయి నాయకత్వాన్ని తరచూ కలుస్తూ అవకాశం కోసం ఎదురు చూశారు రవి. అలాగని తండ్రికి వ్యతిరేకంగా వ్యవహరించకపోయినప్పటికీ వారసత్వం విషయంలో రాజీపడలేనని చాలా కాలం క్రితమే ప్రకటించారు. దాంతో మాడుగులలో అక్కాతమ్ముళ్ల మధ్య పోరు ఖరారైంది. ఇప్పుడు ఎవరి విజయావకాశాలను ఎవరు దెబ్బతీస్తారనేది ఆసక్తిగా మారింది.