Site icon NTV Telugu

Virat Kohli: 12 ఏళ్ల తర్వాత బరిలోకి.. అందరి కళ్లు విరాట్ కోహ్లీపైనే!

Virat Kohli Out 1

Virat Kohli Out 1

దేశవాళీ క్రికెట్‌ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాల మేరకు టీమిండియా స్టార్‌ ఆటగాళ్లంతా రంజీ బాట పట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ పంత్ బరిలోకి దిగగా.. నేడు విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్, మహ్మద్‌ సిరాజ్‌లు రంజీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యారు. నేటి నుంచి ఆరంభమయ్యే రంజీ ట్రోఫీ గ్రూపు-డి చివరి రౌండ్లో రైల్వేస్‌తో ఢిల్లీ తలపడనుంది. 12 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ తరపున విరాట్ బరిలో దిగుతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన కోహ్లీ ప్రదర్శనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

హర్యానాతో ప్రారంభమయ్యే గ్రూపు-సి చివరి రౌండ్‌ పోరులో కర్ణాటక తరఫున లోకేష్ రాహుల్‌ బరిలో దిగుతున్నాడు. విదర్భతో జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్‌ తరఫున మహ్మద్‌ సిరాజ్‌ ఆడనున్నాడు. 17 పాయింట్లతో గ్రూపు-డి పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న రైల్వేస్‌.. ఢిల్లీపై గెలిస్తే నాకౌట్‌ రేసులో నిలిచే అవకాశం ఉంటుంది. 14 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న ఢిల్లీ.. ఈ మ్యాచ్ గెలిచినా నాకౌట్‌ చేరుకోవడం కష్టమే. తమిళనాడు (25), చండీగఢ్‌ (19), సౌరాష్ట్ర (18) జట్లు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు కర్ణాటక నాకౌట్‌ రేసులో నిలవాలంటే హర్యానాపై తప్పక గెలవాల్సి ఉంది.

Exit mobile version