Delhi Car Blast: ఢిల్లీ ఉగ్రదాడిపై దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఈ దర్యాప్తులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఏజెన్సీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు కేవలం i20 లేదా EcoSport కార్లను మాత్రమే కాకుండా, మరో రెండు పాత వాహనాలను పేలుడు పదార్థాలతో నింపడానికి సిద్ధమయ్యారు. అనేక ప్రదేశాల్లో దాడులు నిర్వహించడానికి వీలుగా అదనపు వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ సమాచారాన్ని అనుసరించి, ఏజెన్సీలు ఇప్పుడు ఈ అదనపు వాహనాల ఎక్కడ నుంచి తీసుకోవాలనుకున్నారు. వాటిని ఎక్కడ తయారు చేస్తున్నారు. వాటిని ఎవరు సేకరించారు. అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నాయి. నిఘా సంస్థ వర్గాల ప్రకారం.. ఉగ్రవాదులు భారీ దాడులకు యత్నించారు. ఈ ఉగ్రముఠా నెట్‌వర్క్‌పై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.
మరోవైపు.. ఎర్రకోట పేలుళ్ల కేసు, ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్ దర్యాప్తు ఇప్పుడు కశ్మీర్‌కు చేరుకుంది. కౌంటర్ ఇంటెలిజెన్స్ కశ్మీర్ (CIK), పోలీసుల సంయుక్త బృందాలు లోయ అంతటా 15 వేర్వేరు ప్రదేశాలలో దాడులు చేశాయి. ఖాజీగుండ్‌లో జరిగిన దాడిలో డాక్టర్ వహీద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఫరీదాబాద్ మాడ్యూల్‌తో అనుసంధానించబడిన అనుమానిత నెట్‌వర్క్‌పై దర్యాప్తులో భాగంగా ఈ చర్య తీసుకున్నారు.
